బద్రి @ 25 – జీవితాలను మార్చిన సినిమా

సరిగ్గా పాతికేళ్ల క్రితం 2000 సంవత్సరం. పూరి జగన్నాధ్ అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చిన పవన్ కళ్యాణ్ బద్రి విడుదల రోజు. మొదటి రోజు కొంచెం మిక్స్డ్ టాక్ వినిపించింది. రమణగోగుల ఆడియో అప్పటికే పెద్ద హిట్టు కాగా మాస్ కి నచ్చే అంశాలు తక్కువగా ఉన్నాయనే మాట నిర్మాత త్రివిక్రమరావులో కంగారు పుట్టించింది. కానీ అది కేవలం కొన్ని గంటలకే పరిమితమయ్యింది. యూత్ థియేటర్లకు క్యూ కట్టారు. మాస్ సెంటర్స్ లో టికెట్లు దొరకడం లేదు. ఆడియో క్యాసెట్లు హాట్ కేకులయ్యాయి. పవన్ స్వాగ్ చూసి ఫ్యాన్స్ వెర్రెక్కిపోయారు. ఫలితంగా నలభై ఏడు సెంటర్లలో బద్రి వంద రోజులాడి పూరి అనే సెన్సేషన్ ని ఇండస్ట్రీకి ఇచ్చింది.

అయితే ఇది ఆషామాషీగా జరిగింది కాదు. చిన్నగా చెప్పుకోవాల్సిన పెద్ద కథే ఉంది. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా అనుభవం గడించిన పూరి జగన్నాథ్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ తోనే డెబ్యూ చేయాలని కంకణం కట్టుకుని రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి చోటా కె నాయుడు ద్వారా పవర్ స్టార్ అప్పొయింట్ మెంట్ సంపాదించాడు. ముందు చోటా కథ విని సంతృప్తి చెందాకే రికమండ్ చేశాడు. ఓ రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ కు స్టోరీ వినిపించి మెప్పించి క్లైమాక్స్ మార్చమని చెప్పినా మార్చకుండా తన స్క్రిప్ట్ కే కట్టుబడి ఎట్టకేలకు బద్రిని విజయవంతంగా సెట్స్ పైకి తీసుకెళ్లగలిగాడు. ట్విస్ట్ ఏంటంటే ఛోటాకు చెప్పింది వేరే కథ.

ఇది చాలా జీవితాలను మార్చేసింది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పరిచయం పెళ్లికి పునాది వేసింది బద్రినే. భారీ ఫైట్లు లేకుండా కేవలం ఒక ఆఫీస్ రూమ్ లో పవన్, ప్రకాష్ రాజ్ మధ్య అరుచుకునే సీన్ తో మాస్ కి గూస్ బంప్స్ తెప్పించే ట్రెండ్ మొదలయ్యింది కూడా బద్రితోనే. రమణ గోగుల డిమాండ్ రెట్టింపయ్యింది. హీరోయిన్ అమీషా పటేల్ కు తొలి అడుగులోనే బ్లాక్ బస్టర్ దక్కింది. ఒక్క దెబ్బకు పూరికి అవకాశాలు క్యూ కట్టాయి. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు రిఫరెన్స్ బద్రిలో ఉంటుంది. ఇవాళ ఆయన 75వ పుట్టినరోజు నాడే అదే సిబిఎన్ ముఖ్యమంత్రిగా ఉండటం, బద్రి 25 వసంతంలోకి అడుగుపెట్టడం కాకతాళీయం.