పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో విలన్ పాత్రధారులు దెబ్బలు తినడం మామూలే. కానీ ఆయన చేతిలో దెబ్బలు తినడానికి ఇప్పుడో ‘హీరో’ కావాలి. అతనెవరన్న విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కొన్ని రోజులుగా. పవన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఒక సినిమాను ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల దర్శకుడు సాగర్.కె.చంద్ర ఈ సినిమాను రూపొందించనున్నాడు.
నిర్మాతలు ప్రకటించకపోయినా ఇది మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్ అన్నది తెలిసిన సంగతే. అలాగే ఇందులో పవన్ చేయబోయేది పోలీస్ పాత్ర అని చెప్పడం ద్వారా.. ఒరిజినల్లో బిజు మీనన్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడన్నదీ స్పష్టం. ఐతే ఈ పాత్రకు పోటాపోటీగా ఉండే మరో కీలక పాత్రను ఎవరు చేస్తారన్నది సస్పెన్సుగా మారింది.
రవితేజ, రానా, నితిన్, సాయిధరమ్ తేజ్.. ఇలా ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా కన్నడ నటుడు, ‘ఈగ’లో విలన్ పాత్రతో అదరగొట్టిన సుదీప్ పేరు సైతం తెరపైకి వచ్చింది. అతడి పేరు నిజంగా పరిశీలనలో ఉందా, తననే ఎంపిక చేస్తారా అన్నది తెలియదు కానీ.. ముందు ప్రచారంలోకి వచ్చిన పేర్లతో పోలిస్తే సుదీపే ఈ పాత్రకు బాగుంటాడని భావించవచ్చు. ఎందుకంటే రానా, నితిన్, తేజు.. ఇలా ఎవరు చేసినా పవన్‌కు దీటుగా అనిపించరు. పోటాపోటీ పాత్రలు కావడంతో పవన్‌తో వాళ్ల కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాకపోవచ్చు. ముఖ్యంగా నితిన్, తేజు లాంటి యంగ్ హీరోలకు పవన్‌తో వైరాన్ని ఊహించుకోలేం. వ్యక్తిగత జీవితంలో ఉన్న బంధం తెరపై కెమిస్ట్రీకి అడ్డొస్తుంది.
అలా కాకుండా ఒక స్టేచర్ ఉండి, నెగెటివ్ క్యారెక్టర్ చేసిన అనుభవమూ ఉన్న సుదీప్ అయితే.. పవన్‌కు దీటుగా ఆ పాత్రలో బావుండే అవకాశముంది. తెలుగులో స్టార్లకు ఉన్న ఇమేజ్ బంధనాలు, ఇతర కారణాల దృష్ట్యా పవన్‌ను ఎవరు ఢీకొట్టినా అంత బాగుండదేమో. రూమరో నిజమో కానీ.. సుదీప్‌ను ఈ పాత్రకు కన్సిడర్ చేస్తున్నారన్న సమాచారం ఆసక్తికరంగానే అనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates