చిన్నాన్న హ‌త్య.. జ‌గ‌న్‌కు ఇమేజ్‌.. సునీత చెప్పిన సంచ‌ల‌న విషయం

అది 2015. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి తార‌స్థాయికి చేరుకున్న ద‌శ‌. ఆ స‌మ‌యంలో తాడో పేడో.. అన్న‌ట్టుగా.. టీడీపీ, వైసీపీలు ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో పాల్గొన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో హ‌ఠాత్తుగా.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. మార్చి 15న వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు గురయ్యారు. అయితే..అప్ప‌ట్లో దీనిని టీడీపీకి అంట‌గ‌డుతూ.. జ‌గ‌న్ మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. `నారాసుర ర‌క్త చ‌రిత్ర‌` టైటిల్‌తో క‌థ‌నాల‌ను అడ్డ‌దిడ్డంగా వండివార్చేసింది. దీంతో అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు.. ఈ హ‌త్య‌ను అడ్డు పెట్టుకుని.. జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని చూశార‌ని విమ‌ర్శించారు.

అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు మాట‌ల‌ను ఎవ‌రు విశ్వ‌సించారో..లేదో తెలియ‌దు కానీ.. జ‌గ‌న్‌కు మాత్రం అధికారం ద‌క్కింది. క‌ట్ చేస్తే.. మూడేళ్ల త‌ర్వాత‌.. ఇవే వ్యాఖ్య‌ల‌ను వివేకా కుమార్తె, సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస‌కు చెల్లెలు అయిన‌.. డాక్ట‌ర్ సునీత వెల్ల‌డించారు. రాజకీయ ప్రయోజనాల కోసం త‌న‌ తండ్రి హత్యను సానుభూతి కోసం జ‌గ‌న్‌ వాడుకుని ప్రయోజనం పొందారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు  తాజాగా వెలుగు చూశాయి. ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా అనుచరులను గుమ్మంలోకి కూడా రానివ్వడంలేదన్నారు.

త‌న‌ తండ్రి హంతకులను శిక్షించాలని అన్న జగన్‌(సీఎం)ను సజ్జల, సవాంగ్‌ తదితరుల సమక్షంలో బతిమాలాన‌ని సునీత చెప్పారు. “ఉదయ్‌కుమార్‌రెడ్డిని అనుమానితుల జాబితాలో చేర్చడంపై జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు అతడి పేరు పెట్టావ్‌.. ఎంవీ కృష్ణారెడ్డి(వివేకా పీఏ) ద్వారా నీ భర్త రాజశేఖర్‌రెడ్డే హత్య చేయించాడని ఎందుకు అనుకోకూడద“ని జ‌గ‌న్ అత్యంత అమానుషంగా మాట్లాడిన‌ట్టు సునీత చెప్పారు.

పారదర్శక విచారణ కోసం ఆ తర్వాత పలు దఫాలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా సీబీఐ విచారణ అడగాలని సీఎంను కోరిన‌ట్టు సునీత చెప్పారు. అయితే.. సీబీఐ విచారణకు కోర్టును ఆశ్రయిస్తే జగన్‌ రాజకీయ భవిష్యత్‌ నాశనమయ్యే ప్రమాదం ఉందని స‌జ్జ‌ల‌, వైవీ సుబ్బారెడ్డిలు గ‌ట్టిగా త‌న‌ను హెచ్చ‌రించిన‌ట్టు.. సునీత పేర్కొన్నారు. “కానీ మా నాన్న హంతకులకు శిక్ష పడాలంటే నాకు వేరే గత్యంతరం లేకుండా పోయింది. నాకు తెలిసి నాన్న రూ.104 కోట్ల వ్యవహారమేదో భరత్‌ యాదవ్‌, సునీల్‌ యాదవ్‌తో కలిసి సెటిల్‌ చేశారు.“ అని సునీత చెప్పారు.

అంతేకాదు.. “మా నాన్న, పెదనాన్నకు ఉమ్మడి ఆస్తి 600 ఎకరాలు ఉండేది.. మా ముగ్గురికీ (జగన్‌, షర్మిల, సునీత) సమానంగా 200 ఎకరాల చొప్పున పంచారు. తర్వాత ఎకరం లక్ష చొప్పున నా నుంచి వెనక్కి తీసుకున్నారు. ఆస్తి కోసం అవినాశ్‌ వాళ్లతో నా భర్త కుమ్మక్కైనట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలే దు. ఎందుకంటే ఆస్తి మొత్తానికి నేనే వారసురాలిని. ఆయనకు సంబంధం లేదు.“ అని సునీత వివ‌రించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే..రాజ‌కీయం కోస‌మే.. ఆ నాడు.. ఈ కేసును సీబీఐకి ఇవ్వ‌లేద‌ని.. జ‌గ‌న్ టీడీపీపై విమ‌ర్శ‌లు చేశారు. అదే రాజ‌కీయం కోసం.. సీబీఐకి ఇవ్వాల‌న్న సునీత‌ను హెచ్చ‌రించార‌నే విష‌యం వెలుగు  చూడ‌డం అత్యంత దారుణంగా ఉంద‌ని.. విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.