ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ప్రతి ఐదేళ్లకూ పార్టీ మారాల్సి వస్తుంది. వైసీపీ పార్టీ పరుచూరు ఇంఛార్జిగా ఉన్న ఆమంచి ఈసారి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. చీరాల నియోజకవర్గం నుండి వైసీపీ తరపున తనకు అవకాశం వస్తుంది అనుకుని చివరి నిమిషం వరకు ఎదురుచూసిన ఆమంచి ఆ టికెట్ టీడీపీ నుండి వైసీపీలో చేరిన కరణం వెంకటేష్ కు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు.
ఇక్కడ టీడీపీ తరపున మాలకొండయ్య, వైసీపీ తరపున టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ లు పోటీ పడగా, కాంగ్రెస్ తరపున ఆమంచి రంగంలోకి దిగాడు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆమంచి నవోదయం పార్టీ తరపున ఆటోరిక్షా గుర్తు మీద పోటీ చేసి 10 వేల పైచిలుకు ఓట్లతో టీడీపీ అభ్యర్థి మీద విజయం సాధించాడు. 2019 ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో 17 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు.
ఈ సారి ఎన్నికలలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు కరణం, మాలకొండయ్య వర్గాలు పోటాపోటీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అందరికీ సులువుగా అర్ధం అవుతుందని ఆ పార్టీ నుండి ఆమంచి పోటీకి దిగడంతో చీరాలలో ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే పార్టీకి వీడినప్పుడు వైసీపీ అధినేత జగన్ ను పల్లెత్తు మాట కూడా ఆమంచి అనకపోవడం చర్చకు దారి తీస్తున్నది.
ఇదే సమయంలో ఆమంచికి సొంత సామాజిక వర్గం కాపులతో పాటు ఎస్సీ, మత్స్యకార, పద్మశాలి వర్గాలు అండగా ఉంటాయని భావిస్తున్నారు. ఎమ్మెల్యే స్థానం వరకు తమకు ఓటు వేయాలని, ఎంపీ ఓటు మీ ఇష్టం అంటూ క్షేత్రస్థాయిలో ఆమంచి వర్గం చేసిన ప్రచారం మూలంగా వైసీపీ ఓట్లు చీలుతాయా ? టీడీపీ ఓట్లు చీలుతాయా ? అన్న ఆందోళన ఆయా పార్టీలకు దడపుట్టిస్తున్నది. ఆమంచి పోటీ ఎవరి ఓటమికి కారణం కాబోతున్నది ? లేదా ఇద్దరినీ కాదని అతడే విజయం సాధిస్తాడా ? అన్న వాదనా వినిపిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates