ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు మాత్రం తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీర్థయాత్రలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కోసం కాశీకి వెళ్లిన.. ఆయన అక్కడే ఉండి.. మరుసటి రోజు దర్శనాలు చేసుకున్నారు. ఈ పర్యటనలో సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. ఇక, అటు నుంచి మహారాష్ట్ర కు చేరుకున్న చంద్రబాబు షిర్డీ సాయిని దర్శించుకున్నారు.
అయితే.. చంద్రబాబు ఒకవైపు ప్రభుత్వ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం గమనార్హం. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకుని.. ఆమేరకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. దీంతో కొంత మేరకు చంద్రబాబు ప్రభావం నుంచి రాష్ట్రం పక్కకు తప్పుకోలేదు. ఇక, సీఎం జగన్ విషయానికి వస్తే.. ఆయన శుక్రవారం ఉదయం నుంచి విదేశాలకు వెళ్లనున్నారు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్‌కు ఆయన సతీసమేతంగా వెళ్తున్నారు.
పైగా రాష్ట్రంలోనే ఉన్నా.. ఆయన జరుగుతున్న హింసపైకానీ.. రైతుల సమస్యలపై కానీ.. ఎక్కడా స్పందించలేదు. రుతుపవనాలు వస్తున్న క్రమంలో కాల్వల పూడికలు తీయించాలని రైతాంగం కోరుతోంది. అయితే.. సీఎం ఇవేవీ తనకు సంబంధం లేనట్టే వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయా సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాశారు. రైతుల సమస్యలు పట్టించుకోవాలని.. హింసను అరికట్టాలని ఆయన విన్నవించారు. సీఎం నుంచి మాత్రం స్పందన అయితే.. రాలేదు.
ఇక, పవన్ కూడా.. సతీసమేతంగా రష్యాకు వెళ్తున్నట్టు సమాచారం. ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత.. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. అక్కడే కాశీ విశ్వనాధుని మందిరంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం.. ఆయన రష్యా పర్యటనకు రెడీ అయ్యారని తెలుస్తోంది. సో.. ఇదీ .. సంగతి!