ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఓవైపు మెగా ఫ్యామిలీ అంతా జనసేనకు అండగా ఉంటే.. బన్నీ ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి తన మిత్రుడైన వైకాపా అభ్యర్థికి ప్రచారం చేయడంపై మెగా అభిమానులు, జనసైనికుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
పార్టీలతో సంబంధం లేకుండా తన మిత్రుడి కోసం వెళ్లానని బన్నీ ఆ రోజుల్లో క్లారిటీ ఇచ్చినా కూడా అపార్థాలు తొలగిపోలేదు. ఐతే సోమవారం హైదరాబాద్‌లో ఓటు వేసేందుకు వచ్చి మీడియాను కలిసిన బన్నీ.. మరోసారి ఆ పర్యటన గురించి వివరణ ఇచ్చాడు. అతనేమన్నాడంటే..
‘‘నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నాకు అన్ని పార్టీలు ఒక్కటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మావయ్య పవన్ కళ్యాణ్‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపా. ఒకవేళ భవిష్యత్తులో మా మావయ్య చంద్రశేఖర్ గారు, బన్నీ వాసు ఇలా నాకు వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తులకు మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తా. శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు.
బ్రదర్ మీరెప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తా అని ఆయనకు మాట ఇచ్చాను. 2019లో ఆయన రాజకీయాల్లోకి వచ్చినపుడు వెళ్లలేకపోయాను. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఈసారైనా వెళ్లాలని నా మనసులో ఉంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి నేనే ఫోన్ చేసి వస్తానని చెప్పా. అందుకే నా భార్యతో కలిసి నంద్యాలకు వెళ్లాను’’ అని బన్నీ స్పష్టం చేశాడు.