కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు చవి చూస్తున్నారు. కొన్ని నెలల క్రితం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక ప్రాజెక్టుని ఆర్భాటంగా ప్రకటించారు. టీమ్ మొత్తాన్ని ఫోటోల రూపంలో పరిచయం చేశారు. తీరా చూస్తే దానికయ్యే ఖర్చుకి వర్కౌట్ కాదని భావించి ఆపేశారు. అది కాస్తా బాలీవుడ్ హీరో సన్నీడియోల్ కు వెళ్ళింది. గదర్ 2 తర్వాత మార్కెట్ పెరగడంతో తనతో చేసేందుకు ప్రొడ్యూసర్లు సుముఖంగా ఉన్నారు. ఇది గతం.
ఇక వర్తమానానికి వస్తే నాని, సుజిత్ కలయికలో డివివి దానయ్య ప్లాన్ చేసుకున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ముందుకెళ్లే సూచనలు లేవనే ఫిలిం నగర్ వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజి చేస్తున్న సుజిత్ తో న్యాచురల్ స్టార్ నాని చేతులు కలిపితే ఏ స్థాయిలో ఉంటుందోనని ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకున్నారు. దానికి తగ్గట్టే థీమ్ వివరించే చిన్న టీజర్ అంచనాలు పెంచేసింది. తీరా ఇప్పుడది లేదంటే నిరాశ చెందటం సహజం. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అఫీషియల్ నోట్ రాలేదు కానీ ఏదో ఒక మ్యాటర్ లేనిదే ఇలాంటి న్యూసులు బయటికి రావుగా.
సో ఇది నిజమో కాదో ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. నిజానికి సుజిత్ ఈ ఏడాది మొత్తం ఫ్రీ అయ్యేలా లేడు. ఓజి ముందు అనుకున్నట్టు అక్టోబర్ 27 రిలీజయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. టిడిపి జనసేన కూటమి కనక గెలిస్తే పవన్ ఇంకొంచెం ఆలస్యంగా డేట్లు ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాంటప్పుడు టార్గెట్ డేట్ చేరుకోవడం కష్టం. నాని కాంబోకి బ్రేక్ పడేందుకు ఇది కూడా కారణమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే రీజన్ కాకపోయినా భోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమాని చిరంజీవి వద్దనుకున్న సంగతి తెలిసిందే. సరిపోదా శనివారం ప్రమోషన్ల వరకు నాని మూవీ సంగతి తేలేలా లేదు.