చరణ్ కోసం లెజెండా.. యంగ్ సెన్సేషనా?


ఒక సెన్సేషనల్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. సౌత్ ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన శంకర్.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో భారీగా నిర్మించబోతున్నాడు. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేశాక, శంకర్ ‘ఇండియన్-2’ను పూర్తి చేశాక.. ఇద్దరికీ కుదిరే సమయంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతానికి హీరో, దర్శకుడు, నిర్మాత మాత్రమే ఖరారయ్యారు. అసలింకా కథ సిద్ధమైందా లేదా అన్న సందేహాలు ఉన్నాయి.

ఐతే శంకర్ ఏడాదికి పైగా ‘ఇండియన్-2’ ప్రాజెక్టుకు దూరంగా ఉన్నాడు. క్రేన్ ప్రమాదం వల్ల ఆగిన షూటింగ్.. కరోనా కారణంగా మరింతగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో శంకర్‌కు చాలానే ఖాళీ దొరికింది. ఈ విరామంలోనే కొత్త సినిమాకు కథ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆ కథతోనే రామ్ చరణ్ హీరోగా సినిమా తీయబోతున్నట్లు చెబుతున్నారు.

ఐతే మిగతా నటీనటులు, టెక్నీషియన్ల సంగతేమో కానీ.. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అనే చర్చ మొదలైపోయింది. శంకర్ కెరీర్లో మెజారిటీ చిత్రాలకు ఎ.ఆర్.రెహమానే సంగీతం సమకూర్చాడు. అతను అందుబాటులో లేకో, మరో కారణంతోనో అపరిచితుడు, స్నేహితుడు సినిమాలకు హ్యారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చాడు. ఐతే తాజాగా ‘ఇండియన్-2’ సినిమాకు కూడా రెహమాన్‌ను పక్కన పెట్టేశాడు శంకర్. అతడి బదులు అనిరుధ్‌ను ఎంచుకున్నాడు.

శంకర్-రెహమాన్ కలయికలో చివరగా వచ్చిన ‘రోబో-2’ సంగీత పరంగా తీవ్ర నిరాశకు గురి చేసింది. గత కొన్నేళ్ల నుంచి రెహమాన్ సంగీతం తన స్థాయికి తగ్గట్లు లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్-2కు అతణ్ని పక్కన పెట్టి యంగ్ సెన్సేషన్ అనిరుధ్‌ను శంకర్ ఎంచుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మరి చరణ్ సినిమాకు మళ్లీ లెజెండరీ రెహమాన్ వైపు చూస్తాడా లేక అనిరుధ్‌తోనే వరుసగా రెండో సినిమా చేస్తాడా.. లేక వేరే ప్రత్యామ్నాయం ఏదైనా చూస్తాడా శంకర్ అన్నది ఆసక్తికరం.