బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ‘దురంధర్’ సినిమా రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తోందో తెలిసిందే. మామూలుగా కొత్త సినిమాలకు క్రమ క్రమంగా వసూళ్లు తగ్గుతంటాయి. కానీ ఈ సినిమా విషయంలో రివర్స్ జరుగుతోంది. వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ముందు 300-400 కోట్ల వసూళ్ల అంచనా ఉండగా.. ఇప్పుడీ చిత్రం రూ.500 కోట్ల మార్కును కూడా దాటేసి రూ.1000 కోట్ల టార్గెట్‌తో ముందుకు సాగుతోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలవబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పాకిస్థాన్‌లో స్పైగా పని చేసే ఇండియన్ సోల్జర్ కథ ఇది. ‘దురంధర్’ పూర్తిగా పాకిస్థాన్‌లోనే నడుస్తుంది. సినిమా చూస్తే.. నిజంగానే పాకిస్థాన్‌లో షూట్ చేశారేమో అనిపిస్తుంది.
కానీ ఇండియా, పాకిస్థాన్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్న నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లి షూట్ చేసే పరిస్థితి లేదు. మరి ‘దురంధర్’ టీం ఎలా ఈ సీన్లు తీసిందన్నది ఆసక్తికరం. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో పాకిస్థాన్‌లోని ‘ల్యారి’ సిటీ సెట్ వేసి మొత్తం సినిమా అక్కడే షూట్ చేయడం విశేషం. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లకు పని చేసిన ప్రొడక్షన్ డిజైనర్ సైని ఎస్.జోరే ఆధ్వర్యంలో 500 మందికి పైగా టీం కొన్ని నెలల పాటు కష్టపడి అక్కడ ఆరు ఎకరాల స్థలంలో ల్యారి సెట్ వేసింది.
ముందు ముంబయిలో సెట్ వేయాలనుకున్నప్పటికీ అంత విశాలమైన ప్రదేశం దొరకడం, ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం కష్టమని బ్యాంకాక్‌ను ఎంచుకుందట టీం. పాకిస్థాన్ పత్రికలు, పాత సినిమాలు, యూట్యూబ్ వీడియోలు.. ఇలా అనేక రెఫరెన్సులు తీసుకుని.. ఎంతో పరిశోధన చేసి.. అథెంటిగ్గా, ఫుల్ డీటైలింగ్ ఉండేలా ల్యారి సిటీని సెట్ రూపంలోకి తీసుకొచ్చింది. ఒక సిటీని ఇంత అథెంటిగ్గా సెట్ రూపంలో తెర మీదకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. సినిమా చూసిన వాళ్లకు అదంతా సెట్టింగ్ అంటే నమ్మబుద్ధి కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates