ముఖేషే నెంబర్ 1..రూ. 6.58 లక్షల కోట్ల సంపద

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీయే దేశంలో అత్యంత కుబేరుడుగా నిలిచారు. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ మొదటిస్ధానంలో నిలబడటం వరుసగా తొమ్మిదోసారి. బహుశా జియో టెలికాం, జియో ఫైబర్, ఆయిల్, రీటైల్ తదితర రంగాల్లోని షేర్లను అమ్మటం వల్ల ముఖేష్ కు ఎదురు లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఏడాది వ్యవధిలో ముఖేష్ సంపద 73 శాతం పెరిగి రూ. 6.58 లక్షల కోట్లకు చేరుకుంది. ఈయన తర్వాత రెండోస్ధానంలో హిందుజాల కుటుంబ ఆస్తుల విలువ రూ. 1.43 లక్షల కోట్లు కావటం గమనార్హం. అంటే మొదటి, రెండోస్ధానాల్లో ఉన్న వారి సంపద విలువ మధ్య వ్యత్యాసం దాదాపు రూ. 5 లక్షల కోట్లు.

భారత్ లోనే కాకుండా అంతర్జాతీయ స్ధాయిలో కూడా ముఖేష్ అంబానీ కంపెనీల షేర్లు మంచి వాల్యుతోనే నడుస్తున్నాయి. ప్రతి ఏడాది, జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలోని అత్యంత సంపన్నుల జాబితాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ తో కలిసి హురూన్ సంస్ధ తయారు చేస్తుంది. ఈ సంస్ధ తయారుచేసిన జాబితాను విడుదల చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో పాటు అనేక కారణాల రీత్యా సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరిగిపోతున్న విషయం తాజా జాబితాలో స్పష్టంగా కనిపిస్తోంది.

మొన్నటి ఆగష్టు 31వ తేదీకి దేశంలో వెయ్యి కోట్ల రూపాయల సంపదకన్నా ఎక్కువున్న 828 మంది భారతీయులను గుర్తించింది. అంటే ఈ జాబితా ప్రకారం కుబేరుల జాబితా ఏడాదికేడాది పెరుగుతున్న విషయం అర్ధమైపోతోంది. కుబేరులు అపరకుబేరులుగా సంపదను పెంచుకునిపోతుంటే పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారట. ఐదేళ్ళ క్రిందటితో పోల్చుకుంటే కుబేరుల జాబితా 6 శాతం పెరిగినట్లు హూరున్ సంస్ధ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

కుబేరుల జాబితాలో హెచ్సీఎల్ శివనాడార్ కుటుంబం రూ. 1.41 లక్షల కోట్లతో మూడోస్ధానం దక్కించుకుంది. రూ. 1.41 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ కుంటుంబం నాలుగోస్ధానం, రూ. 1.14 లక్షల కోట్ల సంపదతో విప్రో యాజమాన్యం అజీమ్ జీ ప్రేమ్ జీ కుటుంబం ఐదోస్ధానంలో నిలిచింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో సైరస్ పూనావాల రూ. 94300 కోట్లతో ఆరోస్దానంలో నిలిచారు. డీమార్ట్ వ్యవస్ధాపకుడు రాధాకృష్ణ దమానీ మొదటిసారిగా మొదటి పదిమంది కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. రూ. 87,200 కోట్లతో ఈయన ఏడోస్ధానం దక్కించుకున్నాడు.

కోటక్ మహీంద్ర ప్రమోటర్ ఉదయ్ కోటక్ రూ. 87 వేల కోట్లతో ఎనిమిదో స్ధానంలో నిలిచాడు. ఫార్మా కంపెనీల్లో ప్రముఖమైన సన్ ఫార్మా ప్రమోటర్ దలీప్ సింఘ్వి రూ. 84 వేల కోట్లతో తొమ్మిదోస్ధానం దక్కించుకున్నారు. గతంలో ఈయన 11వ స్ధానంలో ఉండేవారు. టాటాసన్స్ లో తమ వాటాలను మొత్తం అమ్మేసిన షాపూర్ జీ పల్లోంజీ గ్రూపుకు చెందిన సైరస్ మిస్త్రీ రూ. 76 వేల కోట్లతో పదోస్ధానంలో నిలిచాడు. మొత్తం మీద భారతదేశం పేద దేశం అని పేరున్నా పారిశ్రామికవేత్తలైన కుబేరుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతోంది.