ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ లో అపార్టుమెంట్ కు చెందిన యువతి విషయంలో అనుచితంగా వ్యవహరించిన వైనంపై స్పందించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ అంశం పలు కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లగా.. బాధితురాలికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భేషరతు క్షమాపణలు చెప్పాలన్న ఆదేశాల్ని సుప్రీం వెలువరించింది. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
హైదరాబాద్ శివారులోని నల్లగండ్ల ప్రాంతంలో లక్ష్మీ విహార్ అపార్టుమెంట్ లో జరిగిన పార్కింగ్ వివాదం సుప్రీం వరకు వెళ్లింది. 2020 సెప్టెంబరు 12న రంగం నాగేందర్ యాదవ్ అనే వ్యక్తి అపార్టుమెంట్ ముందు వాహనాన్ని నిలిపేశాడు. దాన్ని పక్కకు పెట్టాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రంగం నాగేందర్ యాదవ్ ఆమెను దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదు చేశారు.
అయితే.. ఈ కేసును కొట్టేయాలని సదరు వ్యక్తి హైకోర్టుకు వెళ్లాడు. అక్కడా చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నాగేందర్ యాదవ్ సుప్రీంకోర్టుకు వెళ్లి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ సూర్యకాంత్.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లు బాధితురాలికి భేషరతు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తాజాగా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకున్నారు. బాధితురాలి తండ్రిని ఉద్దేశించి.. “అతను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పమని ఆదేశిస్తాం. అందుకు అంగీకరిస్తారా?” అని బాధితురాలి తండ్రిని అడిగారు. అందుకుఆయన తన సమ్మతిని వ్యక్తం చేశారు. పార్కింగ్ వద్ద దురుసుగా వ్యవహరించిన వైనం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం ఆసక్తికరంగా మారింది.
కొసమెరుపు – ఇలాంటి సంఘటన ఆధారంగానే ‘పార్కింగ్’ అని ఒక సినిమా వచ్చింది. రెండు కుటుంబాలు ఆ చిన్న గొడవ వల్ల ఎంత భారీగా దెబ్బతిన్నాయో ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. అది సినిమాటిక్ అనుకున్నారు గాని తాజా కేసు చూస్తే పోల్చుకోకుండా ఉండలేం.