ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మంగళవారం రోజు రోజంతా కార్యకలాపాలన్నీ.. తెలుగులోనే సాగాయి. ముఖ్యంగా శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పూర్తిగా సభను తెలుగులోనే నడిపించారు. ముందుగా ఎలాంటి ప్రకటనా చేయకున్నప్పటికీ.. అనూహ్యంగా ఆయన తన నుంచే తెలుగును అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం సభ కొలువు దీరగానే.. ‘అందరికీ శుభోదయం’ అంటూ ఆయన కార్యకలాపాలను ప్రారంభించారు. తర్వాత `ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చట్టాన్ని రెవెన్యూ మంత్రి ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా కూడా.. తెలుగులోనే మాట్లాడిన శాసన సభాపతి.. “భూ వివాదాల పరిష్కారం చట్టం”గా పేర్కొన్నారు. ఇలా మొత్తం సభలో మంగళవారం తెలుగుకు పెద్ద పీట వేశారు. అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించారు. దీంతో తెలుగు భాష పట్ల అయ్యన్న తీసుకున్న నిర్ణయానికి మంత్రులు, శాసన సభ్యులు పొగడ్తలతో ఆయనను ముంచెత్తారు. తమ మాతృభాషకు గౌరవం ఇచ్చే ఈ ప్రయత్నం అనేకమందికి స్ఫూర్తిదాయకమైందని తెలిపారు.
అలాగే, ప్రభుత్వ పనుల్లో తెలుగు భాషా వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నామని మంత్రులు తెలిపారు. శాసన సభాపతి నిర్ణయం తరువాత.. ఇతర నాయకులు, సభ్యులు కూడా తమ ప్రసంగాల్లో తెలుగు వాడాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ ఒరవడి వల్ల భవిష్యత్తులో తెలుగుకు మరింత ప్రాధాన్యం కలిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. దీనిని ఎంత వరకు కొనసాగిస్తారో చూడాలి.
అయితే.. ఇప్పటి వరకు జరగని ప్రయత్నం అయితే తొలిసారి జరగడం మాత్రం గొప్ప విషయమేనని చెప్పాలి. తర్వాత.. మాట్లాడిన మంత్రులు కొందరు దీనిని కొనసాగించారు. మరికొందరు తెలుగు మాట్లాడే ప్రయత్నం చేసి.. తడబడ్డారు. అయితే.. ఇప్పటికిప్పుడు మార్పు రాదని.. ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం మున్ముందు అలవాటుగా మారాలని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates