‘పుస్తెలు అమ్మి అయినా పులస చేప తినాలి’ అన్నది గోదావరి జిల్లాలలో సామెత. వర్షాకాలం మొదలై గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం మొదలయిందంటే గోదావరి జిల్లాలలో పులస చేపల కోసం వేట మొదలవుతుంది. ఆ సమయంలో పులస చేపలు సముద్రం నుండి గోదావరిలోకి ఎదురెక్కడంతో మత్స్యకారుల వలకు చిక్కుతాయి.,
వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ పులస చేప చాలా రుచికరంగా ఉంటుంది. ఇది దేశంలో గోదావరి నదితో పాటు పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిలో మాత్రమే దొరుకుతుంది. అక్కడ ఈ చేపను వాళ్లు ‘హిల్సా’ అని పిలుస్తారు. ఉప్పునీరు, తీపి నీరు కలిసే ప్రాంతంలో దొరకడం మూలంగా ఈ చేపలు ప్రత్యేక రుచి కలిగి ఉంటాయని చెబుతారు.
తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక మత్స్యకారుల వలలో దాదాపు కేజీన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీనిని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ. 24 వేలకు కొనుగోలు చేయడం విశేషం. కేజీన్నర పులస చేప ధర ఇంత ధర పలికితే భవిష్యత్ లో పుస్తెలమ్మినా పులస తినడం కష్టమేనని సామాన్యులు ఉసూరుమంటున్నారు.