దేశీయ టెలికాం రంగంలో జియో ఇప్పటికే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 1 జీబీ ఇంటర్నెట్ డేటా కోసం పెట్టే ఖర్చుతో నెల మొత్తానికి రోజుకు 1 జీబీ ఇంటర్నెట్ డేటా ప్లస్ అన్ లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ప్రకంపనలు రేపింది జియో. దెబ్బకు కోట్ల మంది జియో వైపు మళ్లాయరు. ఇతర నెట్‌వర్క్‌లన్నీ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి అవి కూడా తగ్గి జియోతో సమానంగా ఆఫర్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కొంచెం అటు ఇటుగా అన్ని నెట్‌వర్క్‌ల ప్లాన్లూ ఒకేలా ఉన్నాయిప్పుడు.
ఐతే ఇప్పుడు జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ పేరుతో కొత్త ప్లాన్లను ఆవిష్కరించింది. ప్లాన్‌ను బట్టి రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, డిస్నీ-హాట్‌స్టార్ లాంటి ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా ఉచిత అంతర్జాతీయ రోమింగ్, తొలిసారిగా ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ, డేటా రోల్‌ఓవర్, వైఫై కాలింగ్ తదితర ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ప్లాన్లను డిజైన్ చేసింది. ఈనెల 24 నుంచి జియో స్టోర్లలో కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్లాన్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఐతే మిగతా సౌకర్యాల సంగతెలా ఉన్నప్పటికీ.. 399 రూపాయలకు అన్ లిమిటెడ్ కాల్స్, అవసరం మేరకు ఇంటర్నెట్ డేటా ఇస్తూ నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తే.. అదొక సంచలనం కావడం ఖాయం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లలో మెజారిటీని ఈ ప్లాన్ కచ్చితంగా ఆకర్షిస్తుంది. దీంతో మరోసారి జియో అవతలి నెట్‌వర్క్‌ల కస్టమర్లను లాగేయడం ఖాయం. మరోవైపు రూ.4 వేలకే జియో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి కూడా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో 20 కోట్ల స్మార్ట్ ఫోన్‌లను తయారు చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారట.