ఇకపై ఎవరు పడితే వారు ప్రెస్ అని పెట్టుకోలేరు!

ప్రెస్, ఫలానా ప్రభుత్వ అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా వాహనాల మీద అధికారికంగా స్టిక్కర్లు అంటించడం తప్పేమీ కాదు. అయితే, కొందరు అనధికారికంగా ఆ స్టికర్లు వేసుకొని చలామణీ కావడం తప్పు. ముఖ్యంగా బైకులు, కార్ల మీద ప్రెస్ అని రాసుకొని చాలామంది అనధికారిక రిపోర్టర్లుగా దర్జాగా తిరుగుతున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో కొందరు టెర్రరిస్టులు కూడా ప్రెస్ అని రాసి ఉన్న బైకులు వాడారని, వారిని అరెస్టు చేసిన తర్వాత తేలింది.

ప్రెస్ అని రాసి ఉంటే పోలీసులు కూడా ఆపకుండా వదిలేస్తారు అన్నది వారి ధీమా. అయితే, ఇకపై అనధికారిక వ్యక్తులు ఈ తరహాలో తమ వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక హెచ్చరించారు.

అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై PRESS అనే పదాన్ని ఉపయోగించాలని స్పష్టం చేశారు. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు, వృత్తి పేర్లు వాడితే చర్యలు తప్పవని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, వాహనాల నంబర్ ప్లేట్లపై ఎటువంటి రాతలు, బొమ్మలు ఉండకూడదని చెప్పారు.

అయితే, ప్రాక్టికల్‌గా అక్రెడిటేషన్లు ఉన్న జర్నలిస్టులు మాత్రమే స్టిక్కర్లు వేసుకోవడం సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే పెద్ద పత్రికలు, పాపులర్ మీడియా ఛానెళ్లలో పనిచేసే రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, ఫోటో, వీడియో జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఉండవు. ప్రభుత్వాలు ఒక్కో మీడియా హౌస్, పేపర్‌కు పరిమిత సంఖ్యలోనే అక్రెడిటేషన్లు ఇస్తుండడం ఇందుకు ఒక కారణం.

తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వకపోవడం మరో కారణం. ఏపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఈ క్రమంలోనే కొందరు నిజమైన జర్నలిస్టులు కూడా PRESS అని వాహనాల మీద రాసుకొని తమ సంస్థల ఐడీ కార్డులతో నెట్టుకొస్తున్నారు. నకిలీ రిపోర్టర్లను పట్టుకునే క్రమంలో అసలు రిపోర్టర్లు కూడా ఇబ్బంది పడే అవకాశముంది.