అల్లు వారి ఓటీటీ ‘ఆహా’లో ఈ రోజే విడుదలైంది ‘సూపర్ ఓవర్’ సినిమా. నవీన్ చంద్ర, చాందిని చౌదరి, రాకేందు మౌళి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది. యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆ సినిమా దగ్గర్నుంచి అతడికి అసిస్టెంట్‌గా పని చేస్తూ వచ్చిన ప్రవీణ్ వర్మ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఐతే తన తొలి సినిమాకు వస్తున్న స్పందన చూసి సంతోషించడానికి అతను జీవించి లేడు. ఈ సినిమా మేకింగ్ టైంలోనే అతను ప్రాణాల కోల్పోవడం విచారకరం. ‘సూపర్ ఓవర్’ చాలా వరకు రాత్రి పూట సాగే కథ. చిత్రీకరణ కూడా రాత్రిపూటే ఎక్కువగా సాగింది. సినిమాలో కార్ చేజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఐతే ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుని ప్రవీణ్ వర్మ చనిపోయాడట. సినిమా చివరి దశలో ఉండగా అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
మిగతా పనంతా సుధీర్ వర్మ దగ్గరుండి చూసుకుని సినిమాను పూర్తి చేయించాడు. పరిశ్రమలో ఇన్నేళ్లు పని చేసి, మంచి పేరు సంపాదించి, చివరికి దర్శకుడు కావాలన్న తన కలను నెరవేర్చుకునే సమయంలో ప్రవీణ్ వర్మ చనిపోవడం బాధాకరం. ‘సూపర్ ఓవర్’కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమంలో ప్రవీణ్‌ను తలుచుకుని సుధీర్, నవీన్, చాందిని చౌదరి ఉద్వేగం ఆపుకోలేకపోయారు. కన్నీటి పర్యంతం అయ్యారు. అతణ్ని తలుచుకుంటూనే, అతడి ఆకాంక్షలకు తగ్గట్లుగానే సినిమాలో బ్యాలెన్స్ పార్ట్ తీశామని చెప్పారు.
‘సూపర్ ఓవర్’ సినిమా చివర్లోనూ ప్రవీణ్ వర్మకు నివాళి అర్పించింది చిత్ర బృందం. ‘మిస్ యూ’ అంటూ అతడి ఫొటో వేసి, మేకింగ్ టైంలో అతడి ఫొటోలను ప్రదర్శించారు. అది చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. యాక్షన్ ఘట్టాల చిత్రీకరణలో కాస్ట్ అండ్ క్రూ ఎంత జాగ్రత్తగా ఉండాలనడానికి ఇది తాజా ఉదాహరణ.
Gulte Telugu Telugu Political and Movie News Updates