కుమారి ఆంటీకి ఇంకో ఎలివేషన్

ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకులను మించి పాపులారిటీ సంపాదించిన మామూలు మహిళ కుమారి ఆంటీ. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర్లో రోడ్ సైడ్ చిన్న హోటల్ నడుపుతూ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూట్ షార్ట్స్ ఇన్ఫ్లూయెన్సర్ల దృష్టిలో పడిన ఈ మధ్య తరగతి మహిళ.. ఏడాదిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. రీల్స్, షార్ట్స్‌ ద్వారా ఆమెకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.

ఈ దెబ్బకు వందలు, వేలమంది క్యూ కట్టేయడంతో రోడ్డు బ్లాక్ అయి పోలీసులు రంగంలోకి దిగి ఆమె హోటల్ మూయించేయడం.. ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే జోక్యం చేసుకుని ఆమె హోటల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇప్పించడం తెలిసిందే.

దానికి ముందు, తర్వాత కూడా కొంతమంది సెలబ్రెటీలు కుమారి ఆంటీ హోటల్‌ను సందర్శించారు. ఇప్పుడు మరో పెద్ద సెలబ్రెటీ ఆమె హోటల్లో అడుగు పెట్టాడు. ఆయనే.. సోనూ సూద్.

తెలుగు సినిమాల్లో ఎన్నో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసిన సోనూ.. కొవిడ్ సమయంలో చేసిన అసాధారణ సేవతో భారీగా అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. గతంలో కుమారికి ఇబ్బందులు తలెత్తినపుడు ఆయన ఆమె నంబర్ తెలుసుకుని ఫోన్ చేయడం, మద్దతుగా నిలవడం గమనార్హం.

ఇప్పుడు నేరుగా కుమారి ఆంటీ హోటల్‌నే సందర్శించాడు సోనూ. దీంతో ఆ ప్రాంగణం వందల మందితో నిండిపోయింది. కుమారితో కులాసాగా కబుర్లు చెబుతూ.. ఆమె గురించి మరింతగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు సోనూ.

ఆమె కుటుంబానికి అండగా నిలవాలనుకునే మహిళలందరికీ స్ఫూర్తి అని సోనూ కితాబిచ్చాడు. ఈ సందర్భంగా కుమారి ఆంటీ హోటల్లో రేట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్న సోనూ.. తనకు డిస్కౌంట్ ఇస్తావా అని అడిగితే, ఫ్రీగానే ఫుడ్ పెడతానని ఆమె అంది.