గెలుపు కోసం అప్ఘాన్ క్రికెటర్ ఆస్కార్ నటన..వైరల్

క్రికెట్…దీనికే జెంటిల్మెన్ గేమ్ అని మరో పేరు కూడా ఉంది. బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టిన ఈ జెంటిల్మెన్ గేమ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే, గత రెండు, మూడు దశాబ్దాలుగా ఈ జెంటిల్మెన్ గేమ్ ప్రతిష్ట మసకబారుతోందన్న విమర్శలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా దివంగత క్రికెటర్ హాన్సీ క్రానే మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం మొదలు మ్యాచ్ మధ్యలో బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిపోయిన ఆసీస్ క్రికెటర్లు స్మిత్, వార్నర్ ల ఉదంతం వరకు జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ కు మచ్చ తెచ్చే ఘటనలు ఎన్నో ఉన్నాయి.

మైదానంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా కొందరు క్రికెటర్లు వ్యవహరిస్తున్న వైనం క్రికెట్ ఇమేజ్ ను దెబ్బతీస్తోందన్న విమర్శలున్నాయి. విజయానికి ఒక పరుగు, సెంచరీకి ఒక పరుగు ఉన్న బ్యాట్స్ మన్ సెంచరీ చేయకూడదన్న ఉద్దేశ్యంతో బౌలర్లు కావాలని వైడ్ వేసిన ఘటనలు ఆటగాళ్లకు కూడా చెడ్డ పేరుని తెచ్చాయి. ఇదే రీతిలో తాజాగా టీ20 ప్రపంచ కప్ సందర్భంగా అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ సందర్భంగా అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ గుల్బాదిన్ నాయబ్ ప్రవర్తన క్రికెట్ కి మచ్చ తెచ్చేలా ఉందని విమర్శలు వస్తున్నాయి.

వ‌ర్షం అంత‌రాయం కార‌ణంగా ఈ మ్యాచ్ ను 19 ఓవ‌ర్ల‌కు కుదించి 114 ప‌రుగుల టార్గెట్ ను బంగ్లాకు నిర్దేశించారు. అయితే, 17.5 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగుల‌కు బంగ్లా ఆలౌట్ కావ‌డంతో 8 ప‌రుగుల తేడాతో అప్ఘాన్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో వర్షం మొదలైంది. ఆ సమయంలో బంగ్లా డక్ వర్త్ లూయీస్ ప్రకారం 2 పరుగులు వెనకబడి ఉంది. ఇది చూసిన అప్ఘాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ (ఇంగ్లండ్ మాజీ క్రికెటర్)…స్లో ఇట్ డౌన్ అంటూ ఆటగాళ్లకు చేతులు ఊపుతూ బాల్కనీ నుంచి సంకేతాలిచ్చాడు. దీంతో, ఫస్ట్ స్లిప్ లో ఫీల్డిండ్ చేస్తున్న బౌలర్ గుల్బాదీన్ నాయబ్..హఠాత్తుగా కాలి కండరాలు పట్టుకుపోయాయని కిందపడిపోయాడు. అది చూసిన కెప్టెన్ రషీద్ తో పాటు బంగ్లా బ్యాటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో, మ్యాచ్ ఆలస్యం చేసి కుట్రపూరితంగానే నాయబ్ కింద పడ్డాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వర్షం జోరందుకోవడంతో ప్లేయర్లు పెవిలియన్ కు వెళ్లారు. మళ్లీ వర్షం తగ్గి మ్యాచ్ మొదలైన ఒక ఓవర్ తర్వాత మైదానంలోకి వచ్చిన నాయబ్…చురుగ్గా బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయడమే కాకుండా…ఒక ఓవర్ బౌలింగ్ కూడా చేశారు. దీంతో, నాయబ్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు, సెటైర్లు, మీమ్స్ వెల్లువెత్తాయి. మనోడి నటన చూస్తే ఆస్కార్ అవార్డు ఖాయమని కొందరు ట్రోల్ చేస్తున్నారు. అప్ఘాన్ జట్టు అంటే ఎంతో గౌరవం ఉందని, కష్టపడి అంకిత భావంతో ఆడి గెలిచే ఆ జట్టు ఆటగాళ్లు ఇటువంటి చర్యలకు పాల్పడి గౌరవం పోగొట్టుకోవద్దని నెటిజన్లు అంటున్నారు. అప్ఘాన్ క్రికెటర్ నాయబ్ ఆస్కార్ నటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.