ఆ కాలువకు పోలీసుల పహారా !

కాలువకు పోలీసుల పహారా ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నది నిజమే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఢిల్లీలోని ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి 170 మంది పోలీసులు జీపులు, బైకులతో ఆ కాలువకు గస్తీ కాస్తున్నారు. ఎందుకో తెలుసా ఆ కాలువ నుండి ఎవరూ నీటిని దొంగతనం చేయకుండా ఉండడానికి. ఇది ఆశ్చర్యమే అయినా వాస్తవం.

ఢిల్లీలోనిొ నీటి అవసరాలను తీర్చడంలో మునక్ కెనాల్ పాత్ర ముఖ్యమైనది.  ఈ 102 కిలోమీటర్ల పొడవైన కాలువ యమునా నది నుండి హర్యానాలోని కర్నాల్‌లోని మునాక్ రెగ్యులేటర్‌కు నీటిని అందిస్తుంది. ఆ తర్వాత ఖుబ్రూ బ్యారేజ్, మండోరా బ్యారేజీ మీదుగా వెళ్లి ఢిల్లీలోని హైదర్‌పూర్ వద్ద ముగుస్తుంది. 

ఢిల్లీలో తీవ్రమైన నీటి కొరత వేధిస్తున్నది. మునక్ కెనాల్ నుండి నీళ్లు చోరీ అవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు  కాలువ రెండు ఒడ్డులపై నిఘా ప్రారంభించారు. బవానా నుంచి హైదర్‌పూర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు 170 మంది పోలీసులు మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు గస్తీ నిర్వహిస్తున్నారు.

కాలువ పర్యవేక్షణ పనిని ఔటర్ నార్త్, రోహిణి జిల్లా పోలీసు ఐదు పోలీసు స్టేషన్లకు అప్పగించారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత, మునాక్ కెనాల్ బవానా, నరేలా ఇండస్ట్రియల్ ఏరియా, షహబాద్ డెయిరీ, సమయ్‌పూర్ బద్లీ , కేఎన్ కట్జు పోలీస్ స్టేషన్ ప్రాంతం మీదుగా హైదర్‌పూర్ ప్లాంట్‌కు చేరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులకు నీటి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం విశేషం. మునక్ కెనాల్ ద్వారా హర్యానా నుంచి ఢిల్లీ వాటాకు 1050 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 985 ఎంజీడీల నీరు మాత్రమే అందుతోంది. ఢిల్లీలోని ఏడు వాటర్ ప్లాంట్లు దీని మీదనే ఆధారపడి ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే ఈ భద్రత ఏర్పాటు చేశారు.