టీడీపీ అధినేత, ఏపీ తాజా నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు కీలక హామీలకు సంబంధించిన ఫైళ్ల పై సంతకాలు చేశారు. అయితే.. వీటిలో ఒకటి హామీ ఇవ్వని సంతకం కూడా ఉంది. ఎన్నికలకు ముందు కూడా.. ఈ అంశానికి సంబంధించిన ప్రస్తావనను కూడా తీసుకురాలేదు. కానీ, ఇప్పుడు సదరు అంశంపై సంతకం చేశారు. అదే.. “స్కిల్ సెన్సస్“. అంటే.. `నైపుణ్యాభివృద్ధి లెక్కింపు`మరి దీనిని ఎందుకు చేశారు? అసలు హామీ ఇవ్వని వాటిపై సంతకం చేయడం ఏంటి? అనే సందేహం కామన్.
విషయంలోకి వెళ్తే.. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే వరకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్రంలో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడే నిరుద్యోగానికి కేంద్రం చెప్పిన నిర్వచనాన్ని.. ఇప్పుడు చంద్రబాబు పాటిస్తున్నారు. నిరుద్యోగం అంటే.. అందరూ అనుకునేది “చదువుకున్నాడు.. ఉద్యోగం రాలేదు. సో.. నిరుద్యోగి“ అని! కానీ, కేంద్రం ఈ నిర్వచనాన్ని 2018లోనే మార్చేసింది.
చదుకున్న వారంతా నిరుద్యోగులు కాదు. చదువుకుని నైపుణ్యం ఉండి.. కూడా ఉద్యోగం రాని వారిని నిరుద్యోగులుగా కేంద్రం గుర్తించింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను చంద్రబాబు అవలంభిస్తున్నారు. ఉన్న త విద్య అభ్యసించినా నైపుణ్య లేమితో యువతకు ఉద్యోగాలు రావడంలేదు. ఈ సమస్య పరిష్కారానికే కూటమి సర్కారు నైపుణ్య గణన(స్కిల్ సెన్సెస్) చేపట్టనుంది. ప్రతి ఇంట్లో ఎవరికి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయన్నది తేల్చనుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ రంగానికి డిమాండ్ ఉందో స్టడీ చేసి ఆ ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించనుంది.
ఇక, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే.. ఈ `స్కిల్ సెన్సస్` ఆధారంగా నైపుణ్యం ఉండి ఉద్యోగాలు రాని వారిని ప్రోత్సహిస్తుంది. వారికి ఉద్యోగం వచ్చే వరకు రూ.3000 చొప్పున భృతి అందిస్తుంది. ఇక, చదువు ఉండి.. నైపుణ్యం లేని వారికి మాత్రం ప్రభుత్వమే సొంత ఖర్చులతో ఆరు మాసాల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. అదేసమయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆయా నిరుద్యోగుల నైపుణ్యాన్ని అనుసరించి. ఉద్యోగ కల్పనకు కూడా సర్కారు బాధ్యత తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో సెన్సస్ నిర్వహించే కార్యక్రమానికి చంద్రబాబు నాలుగో సంతకం చేశారు. ఇది .. దేశంలో ఫస్ట్ చేస్తున్న గణన కావడం గమనార్హం. ఫలితంగా నిరుద్యోగుల సంఖ్యతో పాటు.. నైపుణ్య ఉన్నవారు.. లేని వారిని కూడా ఫిల్టర్ చేయనున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే.. అద్భుతమనే చెప్పాలి.