56 : నిప్పుల కుంపటి నాగపూర్ !

ఉత్తరభారతం ఉడుకుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఇవాళ పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల  సెల్సియస్ దాటాయి. మహారాష్ట్రలోని నాగపూర్ లో అత్యధికంగా 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రస్థాయిలో వీస్తున్న వడగాడ్పులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో వడదెబ్బతో 54 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క బీహార్ లోనే 14 మంది మరణించగా అందులో  10 మంది ఎన్నికల సిబ్బంది ఉండడం గమనార్హం.

పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ లోని కొన్ని భాగాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్ గఢ్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్ లలో అత్యధిక ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  రాజస్థాన్ నుండి వస్తున్న వడగాలులు ఢిల్లీ వాసులను హడలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో నిన్న 52 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదయ్యింది. ఇక ఢిల్లీలో నీటి కొరత ఏర్పడడంతో ఆప్ సర్కార్ ఎక్కువ నీటిని సరఫరా చేయాలని కోర్టును ఆశ్రయించింది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనపు నీటిని అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ‘ఎండల వల్ల ఢిల్లీ నీటి అవసరాలు గణనీయంగా పెరిగాయి. దేశ రాజధాని దాహం తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని పిటిషన్ లో కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో కొన్ని రోజులుగా నీటి సమస్య అధికమైంది. ముఖ్యంగా చాణక్యపురిలోని సంజయ్ క్యాంప్ ప్రాంతంతోపాటు గీతా కాలనీ, మరికొన్ని చోట్ల ప్రజలు నీరు లేక అల్లాడుతున్నారు.

కొసమెరుపు : జులై 10, 1913 సంవత్సరంలో అమెరికాలోని డెత్ వ్యాలీలో 56.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం ఇప్పటికీ ప్రపంచ రికార్డు. కానీ దానికి దగ్గరగా నాగ్ పూర్ సమీపంలోని ఓ ప్రాంతంలో 56 డిగ్రీలు నమోదవడం రికార్డు.