ఎందరో తెలుగు వారు.. విదేశాల్లో తమ కీర్తిని చాటుతూ.. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో మంది తెలుగు వారు కీలక స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవాడకు చెందిన మహిళ జయ బాడిగ.. అమెరికాలోని కాలిఫోర్నియాలో తొలి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జయ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం.
శాక్రమెంటో సుపీరియర్ కోర్టుకు జయ బాడిగ నియమితులయ్యారు. ఆమె 2022 నుండి కోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలో కీలకమైన కుటుంబ వ్యవహారాల చట్టంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకున్నారు. న్యాయ వ్యవస్థలో కీలకమైన విషయాల్లో ఆమె చాలా మందికి మార్గదర్శకురాలుగా నిలవడం గమనార్హం. జడ్జి జయ బాడిగ ఏపీలోని విజయవాడలో జన్మించారు. ప్రాథమిక విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. జయ 1991 నుండి 1994 వరకు ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాద్‌లో సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు.
ఆమె 2018 నుండి 2022 వరకు ప్రాక్టీషనర్ గా పనిచేశారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లో, కాలిఫోర్నియా గవర్నర్స్ ఆఫీస్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో అటార్నీగా పనిచేశారు. శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుండి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సాధించారు. కాగా, కాలిఫోర్నియా కోర్టు న్యాయమూర్తి రాబర్ట్ లాఫామ్ పదవీ విరమణతో ఆ పదవి జయ బాడిగను వరించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates