ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్ అభిమానులు. ఎందుకంటే, ప్రపంచ మేటి ఆటగాళ్లు ఏబీ డీ విల్లియర్స్, విరాట్ కోహ్లీ లతో పాటు భీకర బ్యాట్స్ మన్లు, మంచి బౌలర్లు, ఫీల్డర్లు ఉన్నప్పటికీ 17 ఐపీఎల్ ఎడిషన్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఇక, ఈ ఐపీఎల్ 17వ సీజన్ లో అయితే ఆ ఆనవాయితీని కొససాగిస్తూ తొలి 6 మ్యాచ్ లలో డుప్లెసిస్ సేన పరాజయం పాలై మరోసారి టైటిల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

అయితే, ఆ తర్వాత తప్పక గెలవాల్సిన 6 మ్యాచ్ ల్లో అనూహ్యంగా విజయం సాధించి ఆశ్చర్యకరంగా ఆ జట్టు ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి టైటిల్ వేటలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 218 పరుగులు చేయగా, సీఎస్కే 191 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ ఓవర్లో ధోనీ ఒక సిక్స్ కొట్టి ఔట్ కావడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి. యశ్ దయాళ్ ఆ ఓవర్ లో కేవలం 7 పరుగులు ఇచ్చి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్, రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, మూడో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, నాలుగో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి.
మే 19న సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ × కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ల ఫలితాలను బట్టి ప్లేఆఫ్స్ లో ఎవరు ఎవరితో తలపడబోతున్నారో తేలనుంది. ఏది ఏమైనా 15 రోజుల క్రితం పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉండి…ప్లే ఆఫ్స్ కు చేరడం దాదాపు అసాధ్యం అన్న స్థితిలో ఉన్న ఆర్సీబీ వరుసగా అన్ని మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరడం ఐపీఎల్ చరిత్రలో ఓ అద్భుతం అని చెప్పవచ్చు.

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈసారైనా ఆర్సీబీని అదృష్ట దేవత వరిస్తుందా? ఐపీఎల్ లో అద్భుతంగా ఆడి ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకున్న ఆర్సీబీ కప్ కొడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సాలా కప్ నమ్దే? అని బెంగుళూరు ఫ్యాన్స్ నిన్న అర్ధరాత్రి రోడ్లపై వచ్చి సందడి చేశారు.