అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న వారి కలలు నిండకుండానే వారికి నూరేళ్లూ నిండిపోయాయి. అరిజోనా యూనివర్సిటీ నుంచి ఇటీవలే ఎంఎస్‌ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్‌ మణికంఠ రేపాల (25) అనే విద్యార్థులు జలపాతంలో ప్రాణాలు కోల్పోయారు.

ఉన్నత చదువులు పూర్తయిన సందర్భంగా రాకేశ్ రెడ్డి, రోహిత్ లతో సహా మొత్తం 16 మంది స్నేహితులు ఆరిజోనాలోని ఫాజిల్‌ క్రీక్‌ జలపాతానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తూ రాకేశ్‌, రోహిత్‌లు జలపాతంలో మునిగిపోయారు. ఒక రోజు అనంతరం 25 అడుగుల లోతున వారిద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు గుర్తించారు.

ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ దంపతులకు రాకేశ్ రెడ్డి ఏకైక కుమారుడు అని సమాచారం. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. కుమారుడు పట్టా తీసుకుంటున్న సంతోషకర క్షణాలను పంచుకునేందుకు తల్లిదండ్రులు కూడా అమెరికా వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తూ వారు అక్కడ ఉండగానే అతడు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానున్నారు. ఇక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఎంఎస్‌ చేసిన రోహిత్‌ మణికంఠకు వివరాలు అందాల్సి ఉంది. చికాగోలో 25 ఏళ్ల తెలుగు విద్యార్థి రూపేశ్ చంద్ర అదృశ్యం ఘటన మరవక ముందే ఈ వార్త వినాల్సి రావడం అందరినీ కలిచివేస్తున్నది.