దేశమంతా ఈ ఆదివారం నీట్ – యూజీ పరీక్షలు జరిగాయి. దేశమంతా 24 లక్షల మంది పరీక్ష రాశారు. గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల మంది అధికం. ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ తో ముడిపడి ఉన్న ఈ పరీక్షను గుజరాత్‌లోని గోద్రాలో ఒక ఎగ్జామినర్ బేరానికి పెట్టాడు. జాతీయస్థాయి వైద్య విద్య అర్హత పరీక్ష అయిన నీట్-యూజీకి ఎగ్జామినర్‌గా వ్యవహరించిన తుషార్ భట్ అనే ఫిజిక్స్ టీచర్ పరీక్ష పాస్ చేయిస్తానని ఆరుగురు విద్యార్థులతో బేరం కుదుర్చుకున్నాడు.
ఇందుకోసం జవాబులు తెలియని ప్రశ్నలకు ఖాళీగా వదిలేయాలని.. పరీక్ష అయిపోయాక తాను వాటికి సమాధానాలు రాసి పాసయ్యేలా చూస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చాడు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి తనకు రూ.10 లక్షలు ముట్టజెప్పాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో పోలీసులు గత బుధవారం తుషార్ కారును తనిఖీ చేశారు.
ఆరిఫ్ వోరా అనే మధ్యవర్తి తుషార్‌కు ఇచ్చిన రూ.7 లక్షలను కారు నుంచి స్వాధీనం చేసుకొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ తుషార్‌ను విచారణ చేసి అతడి ఫోన్లో నీట్ పరీక్ష రాసిన 16 మంది విద్యార్థుల ఫోన్ నెంబర్లు, వాళ్ల హాల్ టికెట్ల నెంబర్లను గుర్తించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తుషార్, ఆరిఫ్ వోరాతో పాటు మరో నిందితుడు పరుశురామ్ రాయ్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.