తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య ఆలియాస్ దర్శనం మొగులయ్య ప్రస్తుతం పూట గడిచేందుకు దినసరికూలీగా మారాడు. హైదరాబాద్ లోని తుర్కయంజాల్ సమీపంలో ఓ నిర్మాణస్థలంలో పనిచేస్తున్న మొగులయ్య వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలను ఇచ్చాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకోగా, భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
తెలంగాణ ప్రభుత్వం నుండి నెలవారీగా వస్తున్న రూ.10 వేల ఫించన్ ఆగిపోవడంతో మొగులయ్య కూలీ పనులకు వెళ్తున్నట్లు చెబుతున్నాడు. మొగులయ్య, కొడుకుల్లో ఒకరు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. తన కొడుకు అవసరాల కోసం నెలకు రూ.7 వేలు కావాలని, ప్రభుత్వం నుండి వచ్చే గౌరవ వేతనం ఎందుకు ఆగిందో తనకు తెలియదని మొగులయ్య అన్నాడు. మొగులయ్య పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ కూడా పాడడం విశేషం.
కిన్నెర గాయకుడు మొగులయ్యకు నటుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పాడే అవకాశం ఇవ్వడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. గతంలో ఆయన అనారోగ్యానికి గురైనపుడు పలువురు ఆర్ధిక సాయం అందించడంతో కోలుకున్నారు. ప్రస్తుతం ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో కూలీ పనులు చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 వేలు గౌరవ వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.