సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది. 2015లో తులం బంగారం ధర రూ.24,740. 1987లో తులం బంగారం ధర రూ.2570. 2006లో తులం బంగారం ధర రూ.8250 మాత్రమే. ఈ లెక్కన 2030 నాటికి తులం బంగారం ధర రూ.2 లక్షలు కావడం ఖాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దేశీయ, విదేశీ స్టాక్ మార్కెట్లతో పాటు ఇతర పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గంగా మదుపరులకు బంగారమే కనిపిస్తున్న నేపథ్యంలో ధరలకు రెక్కలు వస్తున్నాయని చెబుతున్నారు. గడిచిన 9 ఏండ్లలో భారతీయ మార్కెట్‌లో బంగారం ధర మూడింతలైంది. ఇందుకు కారణం మదుపరులలో మారిన ఆలోచనా వైఖరేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఐదేండ్లలో బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, కరోనా మహమ్మారితో ఏర్పడిన పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివి బంగారం ధరలు పెరగడానికి 75 శాతం కారణమయ్యాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం మీద పెట్టుబడులు తక్కువ రిస్క్ అని భావిస్తున్నారు. అందుకే బంగారం మీద పెట్టుబడులు భవిష్యత్తులో ఆకర్షణీయ లాభాలు కురిపిస్తాయని భావించి అటు వైపు మొగ్గు చూపుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates