అమ్మా, నాన్నలకు చెప్పకుండా ఐఏఎస్ కొట్టేశాడు 

దేశవ్యాప్తంగా సివిల్స్ ఫలితాలలో 1016 మంది విజయం సాధించారు. ఇందులో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. ఇందులో తెలుగమ్మాయి అనన్యరెడ్డి 22 ఏళ్ల మొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. ఇక వెయ్యిలోపు 30 మంది తెలుగువారు సివిల్స్ లో విజయం సాధించారు.

అయితే జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన కేరళకు చెందిన సిద్దార్థ్ రామ్ కుమార్ తన కుటుంబసభ్యులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. గతేడాది సివిల్స్ లో 121వ ర్యాంకు సాధించి ఐపీఎస్ కు ఎంపికై హైదరాబాద్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో మరోసారి సివిల్స్ రాశాడు. అయితే ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.

తాజా ఫలితాలలో సిద్దార్థ నాలుగో ర్యాంక్ సాధించిన విషయం టీవీల ద్వారా తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అతను మరోసారి సివిల్స్ రాస్తున్నట్లు మాకెవరికీ చెప్పలేదని, టీవీల ద్వారా విషయం తెలుసుకుని సంతోషపడ్డామని, ఐఏఎస్ కావాలన్న సిద్దార్థ్ కలనెరవేర్చుకున్నందుకు ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు చెప్పారు. చదువుతో పాటు ఆటలలో కూడా చిన్నప్పటి నుండి సిద్దార్థ్ చురుగ్గా ఉండేవాడని, స్కూల్ టీంకు కెప్టెన్ గా వ్యవహరించాడని వారు వెల్లడించారు. అయితే ఐఏఎస్ గా ఎంపికయ్యే వరకు అమ్మానాన్నలకు తెలియకుండా ఆశ్చర్యపరచడం విశేషమే.