ఈ గ్లోబల్ జమానాలో ప్రేమలు రాష్ట్రాలే కాదు దేశాలే కాదు ఖండాలు దాటుతున్నాయి. స్వచ్ఛమైన ప్రేమ కోసం యువతీ యువకులు ప్రపంచపు సరిహద్దులు చెరిపేస్తున్నారు. ప్రేమకు కులమతాలు..జాతి..అడ్డుకావని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రా అబ్బాయి, అగర్తలా అమ్మాల ప్రేమ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ NIT అగర్తలలో ఇంజనీరింగ్ చదివారు. చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ దాలియాను ప్రేమించారు. అగర్తలకు చెందిన దాలియాతో కలిసి అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. ఈ జంట ప్రేమకు ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న వారు ఇటీవల స్వదేశానికి వచ్చారు. ఈ నెల 24న గుంటూరులో ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో తెలుగు సాంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది.
ఈ నెల 29న దాలియా స్వస్థలమైన త్రిపుర రాజధాని అగర్తలలో వారి సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. త్రిపుర గవర్నర్ ఇంద్ర సేనారెడ్డితో వెంకట్రావుకు గతంలో పరిచయం ఉండడంతో ఆయనను వివాహానికి ఆహ్వానించారు. దీంతో, ఈ పెళ్లికి హాజరైన ఇంద్రసేనారెడ్డి నూతన వధూవరులు రామ్, దాలియాలను ఆశీర్వదించారు.