మోడీపై స్వామి భ‌క్తి.. 250 అడుగుల విగ్ర‌హం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఓ వ్యాపార వేత్త స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధికారంలోకి వ‌చ్చాక అనూహ్యంగా త‌న వ్యాపారాలు పుంజుకున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అందుకే ఆయ‌న‌పై ఉన్న భ‌క్తి, ప్రేమ‌ల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జీవించి ఉండ‌గానే ఆయ‌న భారీ విగ్ర‌హం నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. ఆయ‌నే.. ఈశాన్య రాష్ట్రం అస్సాంకు చెందిన న‌వీన్ చంద్ర‌బోరా. ఈయ‌న ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ , స‌హా.. గ‌నుల వ్యాపారిగా పేరు పొందారు. టీ తోట‌లు కూడా ఉన్నాయి.

గ‌డిచిన 8 ఏళ్ల కాలంలో బోరా వ్యాపారాలు నాలుగింత‌ల‌య్యాయి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థ‌ల‌కు రుణ మాఫీ చేసిన నేప‌థ్యంలో ఈయ‌న‌కు కూడా.. భారీ రిలీఫే ల‌భించింది. ఇదెలా ఉన్నా.. ఇప్పుడు ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేవ‌లం ఇక్క‌డితోనే ఆయ‌న ఆగిపోలేదు. కార్య‌రంగంలోకి కూడా దిగిపోయారు. గౌహ‌తికి స‌మీపంలో ఉన్న త‌న సొంత స్థ‌లంలో నే మోడీకి విగ్ర‌హం నిర్మించాల‌ని బోరా నిర్ణ‌యిం చి.. తాజాగా భూమి పూజ‌లు కూడా చేశారు. ప్ర‌స్తుతం ఈ పూజ‌లు కొన‌సాగుతున్నాయి.

కాగా, ప్ర‌ధానికి తాను వీర విధేయుడినని.. ఆయ‌న పాల‌న బాగుంద‌ని బోరా వెల్ల‌డించారు. మోడీ విగ్ర‌హాన్ని 200 కోట్ల‌రూపాయ‌ల వ్య‌యంతో నిర్మిస్తున్న‌ట్టు చెప్పారు. మొత్తం సొమ్మంతా త‌న‌దేన‌న్నారు. ఈ విగ్ర‌హం.. మొత్తం 250 అడుగుల ఎత్తు ఉండ‌గా.. బాటం ప్లేస్ 60 అడుగులు ఉంటుంద‌ని. విగ్ర‌హం 190 అడుగులు ఉంటుంద‌ని.. మొత్తంగా దేశంలోని ఎత్త‌యిన విగ్ర‌హాల్లో ఇది కూడా చోటు సంపాయించుకుంటుందన్నారు.

ప్ర‌స్తుతం దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఏర్పాట్లు చేయ‌డం.. స‌హ‌క‌రించ‌డం గ‌మ‌నార్హం. ఈవిగ్ర‌హం పూర్త‌యితే.. దేశ స్వాతంత్య్ర చ‌రిత్ర‌లో జీవించి ఉన్న ప్ర‌ధానికి విగ్ర‌హం క‌ట్ట‌డం ఇదే తొలిసారి కానుంది.