బాల రాముని ప్ర‌తిష్ట‌.. దేశ బ‌హిష్క‌ర‌ణ వేటు

భార‌త దేశంలో 500 ఏళ్లనాటి అయోధ్య వివాదానికి తెర‌దించుతూ.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఇక్క‌డ రామాల‌యం నిర్మించ‌డం.. బాల‌రాముని విగ్ర‌హానికి ప్రాణ ప్ర‌తిష్ట చేయ‌డం తెలిసిందే. దీనిని కేవలం దేశానికి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయులు.. కూడా సంబ‌రాల్లో పాల్గొనాల‌ని ప్ర‌ధాని స్వ‌యంగా పిలుపునిచ్చారు. దీంతో భావోద్వేగానికి గురైన భార‌తీయ‌లు ఎక్క‌డెక్క‌డున్నా.. బాల‌రామ‌య్య ప్ర‌తిష్టాప‌నా ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు.

అయితే.. ఇదే కువైత్‌లో ఉన్న భార‌తీయుల‌కు ప్రాణాల మీద‌కు తెచ్చింది. ఈ దేశంలో మ‌త‌ప‌ర‌మైన నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలిసి కూడా.. అక్క‌డి భార‌తీయ పౌరులు.. ఒకింత హ‌ద్దు మీరారు. అంతే.. ఆ దేశ చ‌ట్టాల ప్ర‌కారం.. కువైత్ అధికారులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. కేసులు న‌మోదు చేయ‌డంతోపాటు దేశ బ‌హిష్క‌ర‌ణ శిక్ష‌ను అమ‌లు చేశారు. అంతేకాదు.. వారి వీసాల‌ను త‌క్ష‌ణం ర‌ద్దు చేశారు.

ఏం జ‌రిగింది?

కువైత్‌లోని ఒక ప్రముఖ పెట్రో రసాయనాల సంస్థ అనుబంధ విభాగంతో భారతీయులు కొంద‌రు కాంట్రాక్టు ప‌ని చేస్తున్నారు. అక్క‌డ వ‌చ్చిన డ‌బ్బుల‌తో ఏపీలోని కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. అయితే.. అయోధ్య ఘ‌ట్టం వేళ‌.. మోడీ పిలుపు అందుకున్న వీరంతా.. స్థానిక చట్టాలను ఉల్లంఘించి సంబరాలను చేసుకున్నారు. తాము పని చేస్తున్న ప్రదేశంలో శ్రీరామనామ స్మరణతో పాటు.. భార‌తమాతాకి జై అంటూ.. నినాదాలు చేశారు. ఇవి భారీ ఎత్తున వైర‌ల్ అయ్యాయి.

కువైత్ స‌హా.. ఇదు సౌదీ దేశాల్లో ఉండే పౌరులు అక్క‌డ ఉంటూ.. వేరే దేశాన్ని కీర్తించ‌డం తీవ్ర నేరంగా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌న వాళ్ల‌ను అరెస్ట్ చేసి, వారి వీసాలను రద్దు చేసి దేశం నుండి బహిష్కరించారు. అంతేకాదు.. త‌క్ష‌ణ‌మే రాత్రికి రాత్రి విమానంలో భారతదేశానికి పంపారు. త‌దుప‌రి విచార‌ణ‌ను కొన‌సాగిస్తామ‌ని.. కూడా వెల్ల‌డించారు. దీంతో వీరంతా ఇప్పుడు భార‌త్‌కు చేరుకున్నారు. వీరిపై భార‌త ఎంబ‌సీలోనూ ఫిర్యాదులు రావ‌డం గ‌మ‌నార్హం.