ఇంట్లో బైక్‌ను స్టార్ట్‌లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో శనివారం రాత్రి జరిగింది.
త్యాగరాజ వీధికి చెందిన మురళి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల మెకానిక్ వద్ద మరమ్మతు చేయించాడు. ఇంజిన్‌లో సమస్య ఉండటంతో బైక్‌ను బోర్ చేసిన అనంతరం రాత్రంతా స్టార్ట్‌లో ఉంచాలని మెకానిక్ సూచించినట్లు సమాచారం. దీంతో మురళి బైక్‌ను ఇంటికి తీసుకెళ్లి ఇంటి గదిలోనే స్టార్ట్‌లో ఉంచి తలుపులు మూసివేశాడు.
శనివారం రాత్రి మురళి తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన ఇంట్లోని గదిలో నిద్రపోయారు. మురళి, అతని భార్య రేవతి మాత్రం ఇంటి పై అంతస్తులోని గదిలో నిద్రించారు. ఇల్లు ఇరుకుగా ఉండటం, గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రాత్రంతా బైక్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ గదిలో వ్యాపించింది. దీంతో ఆ గదిలో నిద్రిస్తున్న తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఉదయం వరకు వారు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గదిలోకి వెళ్లి చూడగా నలుగురు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులతో పాటు కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో త్యాగరాజ వీధి ప్రాంతంలో శోకసంద్రం నెలకొంది. స్థానికులు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates