ఉద్యోగాల‌కు భారీ ఎస‌రు.. `ఏఐ` కొంప ముంచేస్తుందా?

ప్ర‌పంచ వ్యాప్తంగా.. నిరుద్యోగం ముసురుకున్న విష‌యం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశం.. అని చెంద ని దేశ‌మ‌ని.. ఈ విష‌యంలో తేడా లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌దీ ఇదే ప‌రిస్థితి. ఉద్యోగాల క‌ల్ప‌న‌.. అనేది అది ప్రైవేటైనా.. ప్ర‌భుత్వ‌మైనా.. దేశాల‌కు తీవ్ర స‌వాల్‌గా ప‌రిణ‌మించింది. ఇక‌, సాఫ్ట్‌వేర్ రంగం అయితే.. చెప్పాల్పిన ప‌నిలేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఇలాంటి స‌మ‌యంలో అధునాత‌న సాంకేతిక వ్య‌వ‌స్థ‌లు .. మ‌రింత‌గా భ‌యాందోళ‌న‌ల‌ను సృష్టిస్తున్నాయి.

ప్ర‌పంచంలో హాట్ టాపిక్‌గా మారిన కృత్రిమమేథ‌(ఏఐ) ఇప్పుడు ఉద్యోగాల‌కు  గండి కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ‌(ఐఎంఎఫ్‌) మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. “ఏఐ మంచిదే. కానీ, ఇది ఎంత‌వ‌ర‌కు వినియోగించుకుంటామ‌నేది ప్ర‌ధానం. ముఖ్యంగా ఉద్యోగ క‌ల్ప‌న రంగంలో ఏఐ ప్ర‌భావం అంతా ఇంతా ఉండేలా లేదు. దీనివ‌ల్ల లక్ష‌ల ఉద్యోగాలు రాత్రికిరాత్రి పోయినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేదు“ అని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా హెచ్చ‌రించారు.

ఏఐ ప‌ని ప్రారంభిస్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగా 40 శాతం మంది ఉద్యోగులు ఇంటి ముఖం ప‌ట్ట‌డంతోపాటు.. 60 శాతం నియామ‌కాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని క్రిస్టాలినా తెలిపారు. ఈ విష‌యంపై తాము చేసిన అధ్య‌య‌నంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూసిన‌ట్టు చెప్పారు. “ఒక టాలెంట్ ఉన్న ఉద్యోగి ద్వారా వచ్చే ఉత్పాద‌న‌కు రెండింత నుంచి నాలిగింత‌ల ఉత్పాద‌న వ‌స్తుంది. ఏఐ వినియోగించేందుకు అందుకే ఆస‌క్తి పెరుగుతోంది` అని ఆమె వివ‌రించారు.

ఉత్పాద‌క‌త‌(ప్రొడ‌క్ట్) పెరుగుతున్నందున ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ వంటివి ఏఐ వైపు చూస్తున్న‌ట్టు చెప్పారు. “అధునాతన ఆర్థిక వ్యవస్థకలిగిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ఊడే అవకాశం ఉంది. ఎంతో టాలెంట్ ఉంటే త‌ప్ప‌.. ఉద్యోగాలు ల‌భించ‌క‌పోవ‌చ్చు. అందుకే ఏఐని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకునే కంటే.. అవ‌స‌ర‌మైన దేశాల‌కు బ‌దిలీ చేయ‌డం మంచిద‌ని భావిస్తున్నాం“ అని క్రిస్టాలినా పేర్కొన్నారు.