పెట్రోల్.. డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా చేస్తున్న వేళ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని తప్పుడు వార్తలు హైదరాబాద్ మహానగరాన్ని అల్లకల్లోలం చేశాయి. వేలాదిగా వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాయి. దీంతో.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్.. డీజిల్ నిండుకొంది. పలు బంకులు మూసేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. డెలివరీ బాయిస్ పరిస్థితి ఆగమాగంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక జమాటో ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా చూపింది. హైదరాబాద్ లోని చంచల్ గూడ కు చెందిన జమాటో బాయ్ టూవీలర్ లో పెట్రోల్ అయిపోయిన పరిస్థితి. అదే సమయంలో చేతికి ఆర్డర్ వచ్చింది. దీంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో తన వద్ద ఉన్న గుర్రం మీదనే అతగాడు వెళ్లి ఫుడ్ డెలివరీ చేశాడు.
గుర్రం మీద ఎక్కి.. జమాటో బ్యాగ్ భుజానికి తగిలించుకొని వెళుతున్న అతన్ని కొందరు వీడియోలు తీశారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్టారని.. తన టూవీలర్ లో పెట్రోల్ అయిపోందని.. అందుకే తాను ఇలా గుర్రం మీద డెలివరీకి వెళుతున్నట్లుగా పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ బాయిస్.. ఓలా.. రాపిడో లాంటి టూవీలర్ డ్రైవర్లు కూడా పెట్రోల్ బంకులు మూసి ఉండటం.. భారీగా క్యూలు ఉన్న నేపథ్యంలో సేవలు అందించే విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.