ఘోరం: అమెరికాలో ఐదుగురు అమలాపురం వాసులు దుర్మరణం


అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు వారు దుర్మరణం పాలు కావటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించిన సమాచారం అందినంతనే అమలాపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోవటం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా చెబుతున్నారు.

జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయని చెబుతున్నారు. టెక్సాస్ నుంచి డల్లాస్ కు వెళుతున్న మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారంతా ఎమ్మెల్యే పొన్నాడ బాబాయ్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా తెలుస్తోంది.

పొన్నాడ నాగేశ్వరరావు.. ఆయన సతీమణి సీతామహాలక్ష్మి.. కుమార్తె నవీన గంగ.. మనమడు, మనమరాలు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నాగేశ్వరావు అల్లుడు, నవీన గంగ భర్త లోకేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం షాకింగ్ గా మారింది. ఈ ప్రమాదంపై స్పందిస్తున్న తెలుగు సంఘాల వారు స్థానిక అధికారులతో మాట్లాడి సహాయ కార్యక్రమాల్ని చేపడుతున్నారు.