రీల్ కోసం పోలీస్ జీప్ ను వాడేసింది.. తర్వాతేమైంది?

సోషల్ మీడియాలో తాము ఫేమస్ కావాలన్న తపనతో కొందరు చేస్తున్న అతి.. కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ముందువెనుకా చూసుకోకుండా వారు చేసే పనులకు.. వారి మాయలో పడిన అధికారులకు దిమ్మ తిరిగే షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటిదే పంజాబ్ లో చోటు చేసుకుంది.

ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన పనికి ఒక పోలీసు అధికారి మీద వేటు పడింది. అతగాడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో సదరు అధికారిని నిందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత ఇన్ స్టా ఇన్ ఫ్లెయెన్సర్ అయితే మాత్రం.. తమ వద్దకు వచ్చిన ప్రతి దానికి ఓకే అనటం సరికాదు. ఇన్ స్టాలో రెగ్యులర్ గా రీల్స్ చేసే ఒక యువతి జలందర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి.. పోలీసుల వాహనాన్ని తన తాజా రీల్ కోసం వాడేసింది.

పోలీసు వాహనం బాయినెట్ మీద విలాసంగా కూర్చున్న ఆ యువతి.. పాపులర్ పంజాబీ బీట్ ఘయింట్ జట్టికి డ్యాన్స్ స్టెప్పులు వేసింది. ఈ క్రమంలో ఆమె హావభావాల మీద విమర్శలు వెల్లువెత్తాయి. తాను పాపులర్ కావటం కోసం పోలీసు జీపును వాడుకోవటానికి అనుమతిచ్చిన అధికారుల తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. తన వీడియో చివర్లో సదరు యువతితో పాటు పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి కూడా ఉండటం.. వారి మధ్యన ఏదో సంభాషణ జరగటం.. చివర్లో ఆమె నవ్వుతూ వాహనంలోకి ఎక్కటంతో వీడియో ముగుస్తోంది.

ఈ వీడియో వైరల్ కావటం.. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు.. జలంధర్ స్టేషన్ హౌస్ అధికారి అశోక్ శర్మను సస్పెండ్ చేస్తూ జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక అంశాలకు బదులుగా.. షోకు కోసం చేసే ఈ తరహా పనులకు ఈ మాత్రం మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.