తినే తండికి రేషన్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. భగవంతుడ్ని భక్తితో ఆరాధించేందుకు సైతం రేషన్ పెట్టడం దారుణం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో తీసుకొచ్చిన కొత్త నిబంధన గురించి తెలిసినంతనే ఒళ్లు మండిపోతుంది. వసతులు ఏర్పాటు చేయటం కష్టంగా మారితే… కొత్త పరిష్కారాలు వెతకాలి. అంతే కానీ.. భక్తితో వచ్చే వారికి కండీషన్లు పెట్టేసి.. రేషన్ విధించేయటం ఏమిటన్న సందేహం కలుగక మానదు.
అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు రూం తీసుకునే అవకాశం లేకుండా అధికారులు పెట్టిన కండీషన్ చూస్తే.. ఇదేం రూల్ అన్న భావన కలుగక మానదు.
కొండ మీద రూం తీసుకునే వేళ.. భక్తుడి ఆధార్ నంబరును తీసుకొని సిస్టంలో నమోదు చేస్తారు. అలా ఒక ఆధార్ నంబరు మీద రూం తీసుకున్న తర్వాత, మళ్లీ 90 రోజుల వరకు రూం కేటాయించే అవకాశం లేకుండా చూసేలా సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేశారు. దీంతో.. భక్తులు ఒకసారి అన్నవరం వచ్చి రూం తీసుకుంటే.. మళ్లీ మూడు నెలల వరకు గదిని తీసుకునే అవకాశాన్ని కోల్పోతారు.
అంతేకాదు.. భక్తులు గదిని తీసుకునే సమయంలోనూ.. ఖాళీ చేసే సమయంలోనూ వేలిముద్ర ఇవ్వాల్సి ఉంటుంది. వేలిముద్ర నిర్ణయాన్ని వాడారాంటే అర్థం చేసుకోవచ్చు. తప్పుడు మార్గాల్లో రూంలు పొందే వారికి.. బ్లాక్ మార్కెట్ ను కంట్రోల్ చేయటానికి వీలు కలుగుతుంది. దళారి వ్యవస్థకు బ్రేకులు వేయటానికి నిర్ణయాలు తీసుకోవటం బాగానే ఉన్నా.. ఇలా గదుల కేటాయింపునకు కోటా పెట్టటాన్ని భక్తులు జీర్ణించుకోలేని పరిస్థితి. భక్తుల భక్తికి కోటా నిబంధనను పునరాలోచించుకోవాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.