మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు….మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న ఆర్ద్రతతో పాడిన పాట ఈ కలికాలంలో చాలామంది కఠినాత్ములకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది.
ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులను కడతేర్చిన కసాయివారిని చూస్తున్నాం అక్రమ సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని ఆలుమగలు ఒకరినొకరు చంపించుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక, అక్రమ సంబంధాలకు వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారన్న కారణంతో ముక్కుపచ్చలారని పసివాడిని కూడా పరలోకాలకు పంపిస్తున్న ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కోవలోకే తాజాగా కుషాయిగూడలో జరిగిన ఘటన వస్తుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగున్నరేళ్ల చిన్నారిని కన్నతల్లి కర్కశంగా హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న నాలుగున్నరేళ్ల చిన్నారి తన్విత మృతి చెందింది. కుషాయిగూడకు చెందిన కళ్యాణి, రమేష్ కుమార్ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు.
పుట్టింట్లో ఉంటున్న కళ్యాణి…నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తమ బంధానికి అడ్డుగా వస్తుందన్న కారణంతో కూతురు తన్వితను కళ్యాణి చంపేసింది. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా పాశవికంగా హత్య చేసింది.
కళ్యాణి తల్లి రేణుక ఇంటికి వచ్చి చూసేసరికి తన్విత కదల్లేదు. అయితే, పాప నిద్రపోతుందని బుకాయించిన కళ్యాణి….ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి కూడా డ్రామా ఆడింది. తన కూతురిని బతికించాలంటూ డాక్టర్ లను ప్రాదేయపడింది.
అయితే తన్విత మృతికి కళ్యాణి కారణమై ఉండొచ్చు అంటూ ఆమె భర్త రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో విచారణ జరపడంతో చివరికి నవీన్ తో కలిసి తానే కూతురిని హత్య చేసినట్టు కళ్యాణి అంగీకరించింది. ఈ క్రమంలోనే నవీన్, కళ్యాణిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.