కేరళలోని ఇడుక్కి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ జయలక్ష్మిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇందుకు కారణం ఆమె ఓ రిజిస్ట్రేషన్ విషయంలో అమానవీయంగా వ్యవహరించడమే. ఈ నెల 6వ తేదీని జయలక్ష్మి ఓ క్యాన్సర్ బాధితుడితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే.
డ్రైవర్‌గా పని చేసే సనీష్ అనే వ్యక్తి కొంత కాలం కిందట క్యాన్సర్ బారిన పడ్డాడు. చికిత్స తీసుకున్నప్పటికీ కోలుకోలేకపోయాడు. అతడి పరిస్థితి విషమించింది. తాను ఇక బతకనని అర్థమయ్యాక తన ఆస్తినంతా భార్య పేరు మీదికి మార్చాలని సనీష్ నిర్ణయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ అధికారులను సంప్రదించగా ఇంట్లో ఈ ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని తేల్చారు. దీంతో రిజస్ట్రార్ ఆఫీసుకు వెళ్లని పరిస్థితి తలెత్తింది. ఐతే ఈ లోపు సనీష్ పరిస్థితి ఇంకా విషమించింది.
అతణ్ని అంబులెన్సులో రిజిస్ట్రార్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఐతే బాధితుడి కుటుంబ సభ్యులు సనీష్‌ను అంబులెన్సులోనే ఉంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారుల్ని కోరగా అందుకు సమ్మతించలేదు. దీంతో మృత్యువుతో పోరాడుతున్న సనీష్‌ను కుర్చీలో కూర్చోబెట్టి మూడో అంతస్తులో ఉన్న రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళ్లారు. పని పూర్తి చేయించారు. విషాదం ఏంటంటే.. సనీష్ తర్వాతి రోజే మృత్యు ఒడికి చేరుకున్నాడు. దీని గురించి మీడియాలో రావడంతో ప్రభుత్వం స్పందించింది. విషమ స్థితిలో ఉన్న క్యాన్సర్ బాధితుడితో అమానవీయంగా వ్యవహరించినందుకు సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు సంబంధిత శాఖా మంత్రి.