ఆ ప్రమాదం జరిగిన చోటికి కామెరూన్ 30 సార్లు

ప్రఖ్యాత టైటానిక్ ఓడ మునిగి ప్రదేశానికి వెళ్లిన మినీ సబ్ మెరైన్ ‘టైటాన్’ ప్రమాదానికి గురై అందులోని ఐదుగురు సజీవ సమాధి కావడం విషాదాన్ని నింపింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ప్రమాదంపై టైటానిక్ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పందించారు. సముద్రపు అడుగున టైటానిక్ మునిగిన ప్రదేశానికి సాహసోపేత యాత్ర చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే.

టైటానిక్ సినిమా తీసే సమయంలో కామెరూన్ ఏకంగా 30 సార్లు ఈ ప్రాంతానికి వెళ్లి వచ్చారట. ఈ అనుభవంతో తాజా ప్రమాదానికి కారణాలేంటో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ‘‘టైటానిక్ ఘోరం జరిగిన చోటే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అలాంటి ప్రమాదకర ప్రాంతంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. ఓషన్ గేల్ మినీ సబ్ మెరైన్‌కు అధునాతన సెన్సర్లు ఉన్నాయి. ప్రమాదానికి ముందు ఆ సబ్‌మెరైన్‌కు పగుళ్లు వచ్చి ఉండొచ్చు. ఆ సమయంలో లోపలున్న వారికి కచ్చితంగా వార్నింగ్ బెల్స్ మోగి ఉంటాయి.

వాళ్లు వెంటనే స్పందించి అదనపు లగేజీ గురించి ఆలోచించకుండా అత్యవసర ద్వారం నుంచి బయటపడే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ ఈలోగా సబ్‌మెరైన్ పగిలి పోవడంతో అందరూ ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. ఈ ప్రమాదంలో చనిపోయిన 73 ఏళ్ల హెన్రీ నాకు స్నేహితుడు. అతను పాతికేళ్లుగా నాకు తెలుసు. ఆయన మరణం విచారకరం’’ అని జేమ్స్ కామెరూన్ చెప్పాడు. కామెరూన్ మిత్రుడైన హెన్రీ టైటానిక్ మునిగిన ప్రదేశాన్ని 37 సార్లు సందర్శించాడు. 38వ ప్రయత్నంలో మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.