ఇంతకు మించిన మానవత్వం ఇంకేంటి?

ఈ ఫోటోను చూసినంతనే.. ఒడిశా రైలు ప్రమాద వేళ.. తమ వారికి ఏమైందన్న ఆందోళనలో వెయిట్ చేస్తున్న వారిలా అనుకోవచ్చు. కానీ.. అది నిజం కాదు. వారంతా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు అవసరమైన రక్తాన్ని ఇచ్చేందుకు స్థానిక యువకులు క్యూ కట్టటమే కాదు.. గంటల కొద్దీ వెయిట్ చేయటం ద్వారా.. వావ్ ఒడిశా అనేలా చేశారు.

నెమ్మదస్తులుగా.. వినయ విధేయతలతో ఉంటారన్న పేరు ఒడిశా ప్రజలకు ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో హాస్పిటాలిటీ రంగంలో ఒడిశాకు చెందిన వారు ఎక్కువగా కనిపిస్తారు. వారి మంచితనం ఈ రోజున ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఘోర రైలు ప్రమాదం వేళ.. ఒడిశా యువకులు వ్యవహారించిన తీరు మానవత్వం అంటే ఇంతకు మించి ఇంకేం ఉంటుంది? అన్నట్లుగా మారింది. ఒడిశా ఘోర ప్రమాద వేళ.. వేలాది మంది క్షతగాత్రులయ్యారు.

వందల మంది మరణించిన ఈ ఘోర ప్రమాదంలో.. దగ్గరదగ్గర వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన రక్తాన్ని దానం చేయటానికి స్థానిక యువకులు.. రైలు ప్రయాణికులకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల వద్దకు పోటెత్తారు. బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 238 మంది ప్రాణాలు (ఇప్పటివరకు) కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు.

ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం అవసరం అవుతుందన్న విషయాన్ని గుర్తించిన స్థానిక యువకులు.. ఎవరు పిలుపును ఇవ్వకుండానే.. ఎవరికి వారుగా ఆసుపత్రులకు చేరుకున్నారు. గంటల తరబడి వెయిట్ చేసి.. తమ అవసరం వచ్చే వరకు వేచి ఉండి.. రక్తాన్ని ఇచ్చి వెళ్లిన వారిని చూస్తుంటే.. ఇంతకు మించిన మంచితనం.. మానవత్వం ఇంకేం ఉంటుందన్న భావన కలుగక మానదు.

ఎవరూ అడగకుండా తమంతట తామే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేసిన ఈ యువకుల్ని గుర్తించి మరీ సత్కరించటమే కాదు.. ఇంతటి బాధ్యతతో వ్యవహరించిన వారికి.. ప్రభుత్వ ఉద్యోగాల్ని (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ లాంటి జాబ్ లు కాకుండా) ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవసరమైతే.. కేంద్రం ఇలాంటి వారి విషయంలో ప్రత్యేకంగా స్పందిస్తే.. దేశ ప్రజలకు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నది మర్చిపోకూడదు.