భారత్ లో అత్యుత్తమ బ్రాండ్ గా నిలిచింది టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్). భారత అత్యుత్తమ టాప్ 50 బ్రాండ్ లకు సంబంధించిన జాబితాను తాజాగా ఇంటర్ బ్రాండ్ సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ ర్యాంకుల్లో టాప్ 5 స్థానాల్లో మొదటి స్థానాన్ని టీసీఎస్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో రిలయన్స్.. మూడు స్థానంలో ఇన్ఫోసిస్.. నాలుగో స్థానంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్.. ఐదోస్థానంలో జియో నిలిచాయి. మొత్తం టాప్ 5 అతి తక్కువ సమయంలో అత్యుత్తమ బ్రాండ్ గా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోవటంలో జియో ముందుందని చెప్పాలి.
జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన టీసీఎస్ రూ.1,09,576 కోట్ల బ్రాండ్ విలువతో నిలవగా.. రెండో స్థానంలో నిలిచిన రిలయన్స్ బ్రాండ్ విలువ రూ.65,320 కోట్లుగా తేల్చారు. మూడోస్థానంలో ఇన్ఫోసిస్ నిలిచింది. దీని బ్రాండ్ విలువ రూ.53,324 కోట్లుగా తేల్చారు. గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పు ఏమంటే.. ఇతర రంగాలకు అధిగమించి టెక్నాలజీ రంగం అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 5 బ్రాండ్ లలో మూడు టెక్నాలజీ కంపెనీలే ఉండటం గమనార్హం.
ఆర్థిక సేవల రంగంలో తొమ్మిది సంస్థలు జాబితాలో చోటు సంపాదిస్తే.. హోమ్ బిల్డింగ్.. ఇన్ ఫ్రా రంగం నుంచి ఏడు కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. టాప్ 10 బ్రాండ్ ల మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్ ల వాటానే 46 శాతంగా ఉండటం విశేషం. మొత్తం జాబితాలో అగ్రగామి ఐదు బ్రాండ్ వాటా 40 శాతంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో వ్రద్ధి సాధిస్తున్న రంగాల్లో ఎఫ్ఎంసీజీ తొలి స్థానంలోనిలిస్తే.. తర్వాతి స్థానంలో హోమ్ బిల్డింగ్.. మూడో స్థానంలో ఇన్ ఫ్రా.. నాలుగోస్థానంలో టెక్నాలజీ రంగాలు నిలిచాయి.
టాప్ 10 బ్రాండ్లను చూస్తే..
- టీసీఎస్
- రిలయన్స్
- ఇన్ఫోసిస్
- హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్
- జియో
- ఎయిర్ టెల్
- ఎల్ ఐసీ
- మహీంద్రా
- ఎస్ బీఐ
- ఐసీఐసీఐ బ్యాంకు