బీబీసీ ఎఫెక్ట్‌: రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు!

కొన్నాళ్ల కింద‌ట బ్రిట‌న్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ) ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై గుజ‌రాత్ అల్ల‌ర్ల‌కు సంబంధించి రెండు వ‌రుస డాక్య‌మెంట‌రీల‌ను ప్ర‌సారం చేసిన విష‌యం తెలిసిందే. ఇది అప్ప‌ట్లో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. భార‌త దేశంలో మాత్రం ఆగ‌మేఘాల మీద ఈ ప్ర‌సారాల‌నునిలిపివేశారు. త‌ర్వాత ముంబై స‌హా ప‌లు ప్రాంతాల్లోని బీబీసీ కార్యాల‌యాల‌పైనా సీబీఐ దాడులు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదిలావుంటే.. ఈ డాక్య‌మెంట‌రీ ఎఫెక్ట్ ఇంకా వ‌దిలి పెట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థ రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.

హాక్‌ 115 అడ్వాన్స్‌ జెట్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు.. రోల్స్‌ రాయిస్‌ లంచం ఇచ్చిందని సీబీఐ ఆరోపించింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్‌కు చెందిన ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ రోల్స్‌ రాయిస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌పైనా సీబీఐ కేసు నమోదు చేసింది. భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ కోసం హాక్‌ 115 అడ్వాన్స్‌ జెట్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు.. రోల్స్‌ రాయిస్‌ లంచం ఇచ్చిందని  ఆరోపించింది.

రోల్స్‌ రాయిస్‌ ఇండియా డైరెక్టర్‌ టిమ్‌ జోన్స్‌తో పాటు మధ్యవర్తులైన సుధీర్‌ చౌధరి, అతని కుమారుడు భాను ఛౌదరి, రోల్స్‌ రాయిస్‌ పీఎల్‌సీ, బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.  కాగా 24 హాక్‌ 115 ఏజీటీల కొనుగోళ్లకు రోల్స్‌ రాయిస్‌తో  భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 734.21 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్లుగా ఉంది. అలాగే, 42 ఎయిర్‌ క్రాఫ్ట్‌ల తయారీకి, హిందుస్థాన్‌ ఎరో నాటిక్స్‌కు మెటీరియల్‌ సప్లయ్‌ చేసేందుకు 308.247 మిలియన్‌ డాలర్లు, లైసెన్స్‌ ఫీజు కింద మరో 7.5 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే ఈ డీల్‌ పూర్తి చేసేందుకు.. నిందితులు పలువురు ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని  సీబీఐ ఆరోపించింది. అయితే, అవినీతి ఆరోపణల కారణంగా ఈ డీల్‌ నిలిచిపోయింది. 2016లో దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ. అనంతరం ఆరేళ్ల తర్వాత కేసు నమోదు చేసింది. మ‌రి ఇన్నాళ్లు ఏం చేసిన‌ట్టు? అనేది ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌. దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఏం  చెబుతుందో చూడాలి.