డింపుల్ వర్సెస్ డీసీపీ.. అడ్డంగా బుక్ అయిన బల్దియా

Dimple Hayathi
Dimple Hayathi

సంచలనంగా మారిన సినీ హీరోయిన్ డింపుల్ హయతి వర్సెస్ హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ రాహుల్ హెగ్డే మధ్య నెలకొన్న పార్కింగ్ పంచాయితీలో మరో కోణం బయటకు వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో జీహెచ్ఎంసీ అధికారుల తప్పు బయటకు వచ్చింది. దీంతో.. ఈ ఇష్యూలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటి డింపుల్.. పోలీసు అధికారి రాహుల్ ఇద్దరి పార్కింగ్ ప్లేసులు దగ్గర దగ్గరగా ఉండటంతో పంచాయితీ మొదలైందని చెప్పాలి.

ఈ ఎపిసోడ్ ను చూసినప్పుడు పోలీసు అధికారి రాహుల్ హెగ్డేదే తప్పన్న మాట పోలీసులు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడుకోవటం కనిపిస్తుంది. ఇక.. సోషల్ మీడియాలో అయితే ఓపెన్ గానే ఆయన తప్పును ఎత్తి చూపిస్తున్నారు. అపార్ట్ మెంట్లలో పార్కింగ్ దగ్గర పంచాయితీలు మామూలే. అయితే.. ఇద్దరు సెలబ్రిటీల మధ్య రచ్చ కావటం.. అందునా పోలీసు వర్సెస్ సినీ నటి అన్నంతనే అందరిలోనూ ఆసక్తి వ్యక్తమైంది. పార్కింగ్ వద్ద రోడ్డు మధ్యన ఏర్పాటు చేసే సిమెంట్ దిమ్మల్ని తీసుకొచ్చి తన పార్కింగ్ ప్లేస్ లో పోలీసు అధికారి రాహుల్ తరఫు పెట్టటం సమస్యగా మారింది.

ఎందుకంటే.. ఈ సిమెంట్ దిమ్మల యజమాని జీహెచ్ఎంసీ. రోడ్డు మీద ఉండాల్సిన సిమెంట్ దిమ్మలు.. ఒక అపార్టు మెంట్ లోని పార్కింగ్ ప్లేస్ లో ఎలా ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నను సినీ నటి డింపుల్ ప్రశ్నించటంతో బల్దియా ఈ ఇష్యూలో ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. దీనికి తోడు ఒక మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి.. ఇదే విషయాన్ని బల్దియాలోని అధికారిని ప్రశ్నించటం.. అవును.. అది తప్పే అవుతుందని తేల్చటంతో పోలీసు అధికారి ఆత్మరక్షణలో పడినట్లైంది.

జీహెచ్ఎంసీకి చెందిన సిమెంట్ దిమ్మల్ని ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లటం.. దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని అధికారులు చెప్పటంతో.. ప్రైవేటు అపార్టు మెంట్ లోకి పబ్లిక్ ప్రాపర్టీని తీసుకెళ్లి.. హద్దులుగా ఎలా పెట్టుకుంటారన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. దీంతో.. ఈ ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి బల్దియా వైపు వెళ్లింది. మరి.. తమ సిమెంట్ దిమ్మల్ని పార్కింగ్ హద్దులుగా పెట్టుకోవటంపై జీహెచ్ఎంసీ అధికారులు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.