బ్రిట‌న్ ప్ర‌ధాని దంప‌తుల ఆస్తి ఆవిరి.. ఏం జ‌రిగింది?

బ్రిట‌న్ ప్ర‌ధాని, భార‌త మూలాలు ఉన్న రుషి సునాక్‌.. ఆయ‌న స‌తీమ‌ణి అక్ష‌త‌ల సంప‌ద ఆవిరి అయి పోయింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా.. 200 మిలియ‌న్ పౌండ్ల సంప‌ద హ‌రించుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. బ్రిట‌న్ ప్ర‌ధానిగా సునాక్ బాధ్య‌త‌లు చేప‌ట్టే స‌మ‌యానికి దేశంలో ఆర్థిక ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేదు. అంత‌కు ముందు ప్ర‌భుత్వం ప‌న్నులుత‌గ్గించ‌డంతో ఏర్ప‌డిన ఆర్థిక ప‌రిస్థితుల‌ను గాడిలో పెట్టేందుకు సునాక్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే.. ఇవి క‌ట్ట‌డి కావ‌డం లేద‌నే స‌మాచారం త‌ర‌చుగా వినిపిస్తోంది.

ఇంతలో ద్రవ్యోల్బ‌ణం కార‌ణంగా.. బ్రిట‌న్ ప్ర‌ధాని దంప‌తుల సంప‌దే ఆవిరి కావ‌డం.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. గత 12 నెలల్లోనే వీరి సంపదలో సుమారు 200 మిలియన్‌ పౌండ్లు ఆవిరయ్యింద‌ని బ్రిట‌న్ మీడియా అంచ‌నా వేసింది. అంటే రోజూ సుమారు 5లక్షల పౌండ్లు కోల్పోతున్న ట్లు లెక్కలు చెబుతున్నారు. తాజాగా సండే టైమ్స్ విడుదల చేసిన బ్రిటన్‌ సంపన్నుల జాబితాలో రిషి సునాక్‌ దంపతులు 275వ స్థానంలో కొనసాగుతున్నారు.

అంతకు ముందు 222వ స్థానంలో ఉండగా.. ఏడాది కాలంలోనే ఈ క్షీణత కనిపించింది. అయితే, ఇన్ఫోసిస్‌ షేర్లు పతనమవ్వడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అంచనా. దీనిలోనూ సునాక్ స‌తీమ‌ణి అక్షతకి 64 బిలియన్‌ డాలర్ల (52 బిలియన్‌ పౌండ్లు) విలువైన వాటా ఉంది. సంస్థ మొత్తం షేర్లలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అయితే, గత ఏడాది నుంచి ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో సునాక్‌ దంపతుల సంపద కూడా తరిగిపోయినట్లు స‌మాచారం.

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు జీతభత్యాల కింద ఏడాదికి 1.65 లక్షల పౌండ్లు సమకూరుతుంది. గతేడాది యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరి సంపద విలువ 730 మిలియన్‌ పౌండ్లకు చేరుకుంది. అయితే, ఇటీవల మార్కెట్లు పతనం అవుతుండటంతో వారి సంపద విలువ 529 మిలియన్‌ పౌండ్లకు (66.8కోట్ల డాలర్లు) పడిపోయింది. దీనిపై బ్రిట‌న్ ప‌త్రిక‌లు రోజుకో క‌థ‌నం రాస్తుండ‌డం గ‌మ‌నార్హం.