వెబ్ సిరీస్ లను సినిమాల రేంజ్ లో నిర్మించడం ప్రైమ్ ప్రత్యేకత. ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, బ్రీత్ లాంటివి కంటెంట్ తో పాటు ఖర్చు కూడా ఆ స్థాయిలో పెట్టడం వల్లే ఆడియన్స్ ని మెప్పించగలిగాయి. తాజాగా వచ్చిన దహాద్ అదే కోవలో చేరేలా ఉంది. రజనీకాంత్ లింగా హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషించిన ఈ సైకో థ్రిల్లర్ లో విజయ్ వర్మ విలన్ గా నటించాడు.
ఈ మధ్య తమన్నా ప్రియుడిగా ముంబై మీడియాలో బాగా హైలైట్ అవుతున్న ఇతనికి గత కొంత కాలంగా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇంతకీ ఈ దహాద్ లో అంత మ్యాటర్ ఉందా. రాజస్థాన్ లోని మండువా అనే చిన్న పట్టణంలో అంతుచిక్కని రీతిలో అమ్మాయిలు పబ్లిక్ టాయిలెట్స్ లో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలా 27 కేసులు నమోదవుతాయి.
వీటిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పూనుకున్న పోలీస్ ఆఫీసర్ అంజలి భాటి(సోనాక్షి సిన్హా)కి స్థానికంగా కాలేజీలో పని చేసే ఓ లెక్చరర్(విజయ్ వర్మ)మీద అనుమానం కలుగుతుంది. అయితే ఎలాంటి ఆధారాలు దొరకవు. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్లే క్రమంలో అంజలితో పాటు ఆమె కొలీగ్స్ కి షాకింగ్ కలిగించే విషయాలు తెలుస్తాయి. అవేంటి చివరికి హంతకుడిని ఎలా పట్టుకున్నారనేది మెయిన్ స్టోరీ
ట్రైలర్ లోనే విలన్ ఎవరో రివీల్ చేశారు కాబట్టి ఎనిమిది ఎపిసోడ్ల సుదీర్ఘమైన సిరీస్ లో చాలా తొందరగానే గుట్టు విప్పేస్తారు దర్శకులు కీమా కగ్టి-రుచికా ఒబెరాయ్. అయితే అతనెవరో తెలిసిపోయాక తప్పించుకునే క్రమం, హత్యలను ప్లాన్ చేసుకునే విధానం ఆసక్తికరంగా చూపించారు . మొత్తం ఏడున్నర గంటల నిడివి ఉండటంతో అవసరం లేని ఉపకథలను జోడించి ల్యాగ్ కు కారణమయ్యారు. క్లైమాక్స్ కొంచెం చప్పగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులను మరీ నిరాశపరచకుండా దహాద్ సాగుతుంది. క్యాస్టింగ్ చాలా బాగా కుదిరింది. చూసిన కథనే ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించడం ఒక ఆర్ట్.