హైదరాబాద్ లో నరబలి కలకలం?

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. నమ్మకాల మూఢత్వంతో అభం శుభం ఎరుగని పిల్లాడ్ని బలి (?)ఇచ్చిన షాకింగ్ ఉదంతం తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న సనత్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విన్నంతనే ఒళ్లు జలదరించి.. భయాందోళనలకు లోనయ్యేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

సనత్ నగర్ పారిశ్రామిక వాడలో అల్లాదున్ కోటిలో రెడీ మేడ్ దుస్తుల వ్యాపారి వసీంఖాన్ అతని కుటుంబం నివాసం ఉంటోంది. చిట్టీల వ్యాపారం నిర్వహించే ఫిజా ఖాన్ వద్ద వసీంఖాన్ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బు ఇవ్వలేదు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వసీంఖాన్ కొడుకును నలుగురు వ్యక్తులు బస్తీలోని ఒక వీధిలో అపహరించారు. ప్లాస్టిక్ సంచిలో తీసుకొని ఫిజాఖాన్ ఇంటి వైపు వెళ్లారు. కొడుకు కనిపించకపోవటంతో తండ్రి వసీంఖాన్ గురువారం రాత్రి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో సీసీ ఫుటేజ్ ఆధారంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలుడ్ని తాము నాలాలో వేసినట్లుగా నిందితులు అంగీకరించినట్లుగా తెలుుస్తోంది. దీంతో.. అర్థరాత్రి వేళ స్థానికుల సాయంతో పోలీసులు నాలాలో వెతగ్గా.. ప్లాస్టిక్ సంచిలో పిల్లాడి డెడ్ బాడీని గుర్తించారు. బాలుడ్ని హత్య చేసే క్రమంలో ఎముకలను ఎక్కడికక్కడ విరిచి ఒక బకెట్ లో కుక్కి.. దాన్ని ప్లాస్టిక్ సంచిలో వేసుకొని నాలాలో విసిరినట్లుగా పేరకొన్నారు.

అయితే.. పిల్లాడ్ని నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు అనుమానిస్తుననారు. చిట్టీ డబ్బుల గొడవ కారణంగా హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఉదంతంలో ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఉదంతంలో అల్లాదున్ కోటి బస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నరబలి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బలి వాదనకు బలాన్ని చేకూరేలా రంగుల ముగ్గులతోపాటు.. నిమ్మకాయలు.. కొబ్బరి చిప్పలు.. గుమ్మడికాయ పగలగొట్టిన వైనం కనిపిస్తున్నాయి. నరబలి ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా నివాసం ఉండే హిజ్రా మీద బాలుడి బంధువులు దాడి చేశారు.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.