విదేశాల నుంచి దేశానికి రావొచ్చు.. కాకుంటే షరతులు వర్తిస్తాయి

కరోనా మీద ప్రపంచానికి క్లారిటీ వస్తోంది. ఈ వైరస్ ప్రపంచానికి పరిచయమైన తొలినాళ్లలో లాక్ డౌన్ తో వ్యవస్థల్ని ఎక్కడికక్కడ స్తంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వైరస్ తీవ్రత ఒకట్రెండునెలలతో పోయేది కాదని.. అది నెలల తరబడి కొనసాగుతుందన్న విషయాన్ని అన్ని దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే గుర్తించాయి. అందుకే.. ఎవరికి వారు కొన్ని మినహాయింపులు ఇస్తూ.. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దేశంలోనూ అలాంటి పరిస్థితే ఉంది. లాక్ డౌన్ స్థానే అన్ లాక్ వెర్షన్లను ఒకటి తర్వాత ఒకటిగా తెర మీదకు తెస్తున్న కేంద్రం.. తాజాగా విదేశీప్రయాణాలకు అనువుగా.. అంతర్జాతీయ విమాన సేవల్ని పునరుద్దరించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే విదేశాలకు పలు విమాన సర్వీసులు షురూ అయ్యాయి. కాకుంటే.. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేందుకు వీలుగా ఈ నెల ఎనిమిది నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునరుద్దరించనున్నారు.

దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం.. అంతర్జాతీయ విమానయాన ప్రయాణికులు తప్పనిసరిగా పద్నాలుగురోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు.. మొదటి ఏడు రోజులు వారి సొంత ఖర్చులతో ప్రభుత్వం నిర్దేశించిన క్వారంటైన్ కేంద్రంలోనూ.. తర్వాతి వారం రోజులు హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు తమ అనుమతి ఉందన్న విషయాన్ని తమ ప్రయాణానికి 72 గంటల ముందే.. న్యూఢిల్లీఎయిర్ పోర్టు.ఇన్ కు తెలియజేయాలని కోరుతోంది. వాస్తవానికి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలేమీ మరీ అంత కఠినంగా లేవనే చెప్పాలి. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తే.. విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే కాదు.. వారి కుటుంబీకులకు సైతం మంచిదన్న విషయాన్ని గుర్తించాలి.