దేశంలో ఫ‌స్ట్ ‘ఆపిల్’ స్టోర్ ప్రారంభం.. ఎక్క‌డంటే!

అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత ఆపిల్ ఐ ఫోన్ కంపెనీ భార‌త్‌లో త‌న మొట్ట‌మొద‌టి ఆపిల్ స్టోర్‌ను ఈ రోజు ప్రారంభించింది. Apple BKC పేరుతో భార‌త దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో అత్యంత అధునాత‌న హంగుల‌తో రూపుదిద్దిన భ‌వ‌నంలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌లో వినియోగ దారుల‌కు అవ‌స‌రమైన అన్ని ఆపిల్ ఉత్ప‌త్తుల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. విశాల‌మైన ప్రాంగ‌ణంలో ఆధునిక సొబగుల‌తో తీర్చిదిద్దిన ఈ స్టోర్‌ను ప్ర‌త్యేకంగా భార‌తీయుల కోసం డిజైన్ చేసిన‌ట్టు ఆపిల్ ఐఫోన్ వ‌ర్గాలు తెలిపాయి.

ఆపిల్ స్టోర్ ప్రారంభాన్ని పుర‌స్క‌రించుకుని తొలిరోజు వినియోగ‌దారుల‌కు ప‌లు సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొన్నాయి. వినియోగ‌దారుల కోసం నూత‌న ఉత్ప‌త్తుల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్టు ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిర్‌డ్రే ఓబ్రియన్ తెలిపారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్‌ జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో యాపిల్‌ బీకేసీని ఏర్పాటు చేశారు. 20,800 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో కస్టమర్లు యాపిల్‌ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయొచ్చు.

అలాగే ఇతర సేవలను కూడా పొందొచ్చు. ఈ స్టోర్‌ను ప్రారంభించడం కోసం కుక్‌ సోమవారమే ముంబైకి చేరుకున్నారు. యాపిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి. భారత్‌లో విస్తరణకు భారీ అవకాశాలు ఉన్న నేపథ్యంలో యాపిల్‌ ఇక్కడి మార్కెట్‌పై దృష్టి సారించింది. అందులో భాగంగా తయారీని చైనా నుంచి భారత్‌కు తరలిస్తోంది. విక్రయాలు సైతం భారీగా పుంజుకుంటున్న నేపథ్యంలో స్టోర్లను ప్రారంభించడం వల్ల మరింత మంది కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేయ‌నుంది.