ఖల్లాస్: లోక్ యాప్ లు డౌన్ చేయొద్దు.. చేస్తే.. ఇవి మరవొద్దు

డబ్బులు అవసరం అయ్యాయని అడ్డగోలుగా అప్పులు చేయటం ఎంత తప్పో.. అవసరమని లోన్ యాప్ ల ద్వారా రుణం తీసుకోవటం అంతకు మించిన పెద్ద తప్పు అవుతుంది. ఆర్థికంగా నష్టపోవటమే కాదు.. అంతకు మించిన తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకున్నట్లే. మనం అప్ లోడ్ చేసే నాలుగు డాక్యుమెంట్లు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నాడు కదా.. ఏమైనా జరిగితే తర్వాత చూసుకుందామని అనుకోవచ్చు. కానీ.. దానికి మించిన తిప్పలు చాలానే వెంటాడి వేధించే దుస్థితి. కలలో కూడా ఊహించలేని తలనొప్పుల్ని తెచ్చి పెట్టే ఈ రుణ యాప్ ల విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.

ఎంత అవసరమైనా రుణ యాప్ ల ద్వారా రుణాల్ని తీసుకునే విషయాన్ని అస్సలు ఆలోచించొద్దని చెబుతున్నారు. దానికి బదులుగా వేరే మార్గాల ద్వారా అప్పు తీసుకున్నా ఫర్లేదు కానీ.. లోన్ యాప్ ల జోలికి వెళ్లొద్దన్న హెచ్చరికల్ని పోలీసులు సైతం చేస్తున్నారు. లోన్ యాప్ మోసాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం షురూ చేశారు. ఇక తప్పదు.. మేం లోన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.. అంతకు మించిన వేరే మార్గం లేదన్న మాటను బలంగా నమ్మితే మాత్రం.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అదే సమయంలో మనం డౌన్ లోడ్ చేసుకునే లోన్ యాప్ ల ద్వారా మన ఫోన్ లో ఉన్న ఫోన్ నెంబర్లు మొత్తం వారికిబదిలీ అవుతాయన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.

అంటే..యాప్ డౌన్ లోడ్ చేసుకోవటంతోనే మన పిలక వారి చేతిలోకి వెళుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. వ్యక్తిగత వివరాలు.. ఫోటోలు.. మనం నివాసం ఉండే ప్రాంతాల సమచారం కూడా వారికి బట్వాడా అవుతుందన్న విషయాన్ని మరవొద్దు. లోన్ యాప్ ద్వారా లోన్లు తీసుకున్న వారికి.. మన ఫోన్ నెంబర్లు అందుబాటులోకి ఉండటంతో పాటు.. మన ఫోటోల మీద వారికి అధిపత్యం వచ్చే కారణంగా.. వాటిని తీసుకొని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందన్నదిమర్చిపోకూడదు. మహిళల ఫోటోల్ని ఛండాలంగా మార్ఫింగ్ చేసి.. మన స్నేహితులకు.. బంధువులకు పంపి మన పరువు తీసే పని మొదలు పెడతారు.

ఒకవేళ అనూహ్యంగా లోన్ యాప్ తలనొప్పుల బారిన పడితే.. వెంటనే సైబర్ క్రైం పోలీసులను కాంటాక్టు చేయాల్సిందిగా కోరుతున్నారు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ లింకును ఇస్తున్నారు. www.cybercrime.gov.in కు కానీ టోల్ ఫ్రీ నెంబరు 1930కు కానీ ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాలని కోరుతున్నారు. సో.. బీకేర్ ఫుల్.